కాళోజీ సేవలు చిరస్మరణీయం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తె లంగాణ భాష, యాస, సంస్కృతి, ప్రజల జీవన విధానాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ మహనీయుడి సేవలను మనమంతా స్మరించుకోవాలన్నారు. కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పుష్పాంజలి ఘటించారు. ప్రజల గొంతుకగా నిలిచిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రజా ప్రభుత్వం సారథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ భాషకు కాళోజీ చేసిన సేవలు శ్లాఘనీయమని, ఆయన స్ఫూర్తితో తెలంగాణ భాష, సాహిత్యానికి మరింత ప్రోత్సాహం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.