కర్ణాటకకు సీఎం డీకే శివకుమార్ సామాన్యుడిలా మార‍్కెట్ అంతా కలియతిరిగి చూశారు. మార్కెట్‌లో స్వయంగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులు, కూలీలతో మాట‍్లాడారు. సామాన్యుడిలా కాకా హోటల్‌లో అల్పాహారం చేసి, కూలీలతో కలిసి చాయ్ తాగుతూ గడిపారు. సీఎం అయినప్పటికీ ఆయన ఏం మారలేదంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. డీకే శివకుమార్ మంగళవారం యశ్వంత్‌పూర్ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ మార్కెట్ ప్రాంగణాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ఉల్లిగడ్డ రైతులు, వ్యాపారులు, మహిళా కార్మికులతో మాట్లాడారు. మార్కెట్‌లో కలియతిరిగిన సీఎం, రైతులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ముఖ్యంగా ఉల్లిగడ్డల వ్యాపారానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన పంటను తూకం వేసే సమయంలో ఏవైనా అక్రమాలు జరుగుతున్నాయా అని కూడా ప్రశ్నించారు. ఉల్లిగడ్డలను రవాణా చేసేందుకు పెరుగుతున్న ఖర్చులు తమ ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయని రైతులు శివకుమార్‌కు తెలిపారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు వ్యవసాయ మంత్రి మార్కెట్‌కు రావడం లేదని వారు ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదులను సీఎం శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెట్‌లో పనిచేస్తున్న మహిళా కార్మికులతోనూ మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఇటీవల ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్న సమయంలో సీఎం మార్కెట్‌ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి మార్కెట్‌కు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
సామాన్యుడిలా మార‍్కెట్ అంతా కలియతిరిగిన సీఎం డీకే శివకుమార్ : సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
September 08, 2026
0
Tags