ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో జియో-ట్యాగింగ్ : భూ వివాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యం !

Telugu Lo Computer
0

భూములు, ఇళ్ల కొనుగోలు, విక్రయాల సమయంలో దశాబ్దాలుగా వెంటాడుతున్న సరిహద్దు వివాదాల కు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఒక విప్లవాత్మక అడుగులు వేసింది. ఆస్తుల నమోదు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు సేల్ డీడ్ పత్రాలతో పాటు ప్రాపర్టీ మ్యాప్‌లను, అక్షాంశ-రేఖాంశ వివరాలతో కూడిన జియో-ట్యాగింగ్ టాను జతచేసే విధానాన్ని వేగవంతం చేసింది. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి ఆస్తి ఖచ్చితమైన భౌగోళిక సరిహద్దులు, లొకేషన్ వివరాలు ప్రభుత్వ డిజిటల్ రికార్డుల్లో భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో వచ్చే భూ వివాదాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ఈ నూతన విధానం అందుబాటులోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోకాలంగా వేధిస్తున్న డబుల్ రిజిస్ట్రేషన్లు, అక్రమ కబ్జాల సమస్యలకు చెక్ పడనుంది. గతంలో కేవలం కాగితాలపై తూర్పు, పడమర, ఉత్తరం, దక్షణం సరిహద్దుల పేర్లు రాసి రిజిస్ట్రేషన్లు చేసేవారు. అయితే కాలక్రమేణా చుట్టుపక్కల ఆస్తులు మారిపోవడం లేదా సరిహద్దు గుర్తులు చెరిగిపోవడంతో అనేక సివిల్ వివాదాలు కోర్టులకెక్కేవి. ఇప్పుడు జియో-ట్యాగింగ్ మరియు డిజిటల్ ప్లాట్ మ్యాపింగ్ ఆధారంగా ప్రతి స్థలానికి ఒక డిజిటల్ ఐడెంటిటీ లభిస్తుంది. దీనివల్ల ఒకరి స్థలాన్ని మరొకరి పేరు మీద రీ-రిజిస్ట్రేషన్ చేయడం లేదా భూమి సరిహద్దులను అక్రమంగా జరపడం సాధ్యం కాదు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, లైవ్ శాటిలైట్ మ్యాపింగ్‌ను వినియోగిస్తోంది. ఆస్తి అమ్మకందారులు , కొనుగోలుదారులు లావాదేవీ సమయానికి సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తికి సంబంధించిన సరిహద్దు కొలతలు , ప్లాన్ లేఅవుట్ , జియో-కోఆర్డినేట్స్‌ను డాక్యుమెంట్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. సబ్-రిజిస్ట్రార్లు ఈ డిజిటల్ మ్యాప్‌లను ఆన్‌లైన్ డేటాబేస్‌తో క్రాస్ చెక్ చేసిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇది కొనుగోలుదారుల్లో పూర్తి స్థాయి నమ్మకాన్ని, భద్రతా భావాన్ని పెంచుతోంది. సరిహద్దుల స్పష్టత , భౌగోళిక రికార్డుల పక్కా అమరిక వల్ల ప్రధానంగా బ్యాంకింగ్ మరియు లీగల్ రంగాల్లో పనులు మరింత వేగవంతమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హోమ్ లోన్లు ఇచ్చే సమయంలో బ్యాంకులు లేదా ఎన్‌ఎఫ్‌బిసిలు జరిపే లీగల్ టైటిల్ స్క్రూటినీ , స్థల పరిశీలన ప్రక్రియ సులభతరం కానుంది. అదే సమయంలో ఆస్తిని వేరేవారికి రీసేల్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో భూ యజమానులకు కోర్టు కేసులు, హద్దుల తగాదాల నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని చట్ట నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default