Ad Code

డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు : ఇద్దరు పోలీసులకు గాయాలు

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మత్తులో ఉన్న ఒక యువకుడు పోలీసులను వాహనంతో తొక్కించేందుకు యత్నించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ కాలు ఫ్రాక్చర్ అవ్వగా, హెచ్-న్యూ ఇన్స్పెక్టర్ తో పాటు మరొక కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కు అందింది. దీంతో వెంటనే ఆయన ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి, హెచ్-న్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఇతర సిబ్బందితో కలిసి అబిడ్స్ పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేశారు. నిఘా సమయంలో అబిడ్స్ లోని పాయల్ ఫుట్ వేర్ సమీపానికి ఒక బ్లూ కలర్ బలెనో కారు వచ్చి ఆగింది. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి కారులోని వారికి ఒక ప్యాకెట్ ను  అందజేస్తుండగా, అక్కడే ఉన్న పోలీసులు ఆ ప్యాకెట్ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో ఉన్న హుస్సేనీ ఆలమ్ కు  చెందిన సైఫ్ అనే యువకుడికి పోలీసులు కారు కిందకు దిగాలని, తమ ఐడీ కార్డులు చూపించాలని సూచించారు. అయితే, కారును పక్కకు తీస్తున్నట్లు నటించిన ఒక్కసారిగా కారును రివర్స్ చేసి వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుకోబోయిన కానిస్టేబుల్ మహేందర్ కాలుపై నుంచి కారును ఎక్కించుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పరారవుతున్న నిందితుడిని ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ బృందం ఛేజ్ చేసి అఫ్జల్ గంజ్ వద్ద పట్టుకుంది. ఈ ప్రక్రియలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరొక కానిస్టేబుల్ వంశీధర్లకు స్వల్ప గాయాలయ్యాయి. కాలుపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ను సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. నిందితుడు సైఫ్ పై  హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0 Comments

Close Menu