తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనలలో భారీ మార్పులు

Telugu Lo Computer
0


తెలంగాణా ప్రభుత్వం బిల్డర్లు, కొనుగోలుదారుల సమస్యలను పరిష్కరించేందుకు భవన నిర్మాణ నిబంధనలలో భారీ మార్పులు చేస్తుంది. ప్రధానంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని నివారించేందుకు పారదర్శకమైన, సరళీకృత విధానాన్ని తీసుకురానుంది. గతంలో ఉన్న సంక్లిష్టమైన నిబంధనల వల్ల ఓసీలు రాక కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న కరెంట్, నీటి సరఫరా ఇబ్బందులను తొలగించడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందేందుకు ఇప్పటివరకు అనేక శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం, సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆధారంగా ఓసీ జారీని మరింత సులభతరం చేయనున్నారు. ముఖ్యంగా చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, నామమాత్రపు జరిమానాలతో అనుమతులు మంజూరు చేసేలా గైడ్‌లైన్స్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే గడువు ముగిసిన అనుమతులు ఉన్న భవనాలకు కూడా ఓసీ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నిర్మాణ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేలా ప్రాజెక్టు భూమిలో 10 శాతాన్ని ప్రభుత్వానికి తనఖా పెట్టే నిబంధనను 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల బిల్డర్లకు మూలధన లభ్యత పెరిగి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. అలాగే, 10 అంతస్తులకు పైబడిన భవనాలకు టీడీఆర్ తప్పనిసరి చేస్తూనే, ఆ ప్రక్రియను ఆటోమేట్ చేసి ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చేయనున్నారు. ఫ్లోర్ ఎత్తును 3.3 మీటర్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆధునిక డిజైన్లకు ఊతమివ్వాలని సర్కారు భావిస్తోంది. టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతూ బిల్డ్‌ నౌ వంటి ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను ప్రభుత్వం విస్తరిస్తోంది. కేవలం ఐదు నిమిషాల్లోనే డ్రాయింగ్ స్క్రూటినీ పూర్తయ్యేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సంస్కరణల వల్ల అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం వేగవంతం కావడమే కాకుండా, సామాన్య ప్రజలకు తక్కువ సమయంలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం ఉంది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default