అమెరికాలో షట్ డౌన్ ఎత్తివేత !

Telugu Lo Computer
0


మెరికాలో 40 రోజులుగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడింది. దీనికి ముగింపు పలికే దిశగా కీలక అడుగు పడింది. దీనికి సంబంధించిన బిల్లును సెనెట్ ఆమోదించింది. దీంతో ఫెడరల్ సర్వీసులన్నీ పునరుద్ధరణకు నోచుకోనున్నాయి. ఇప్పటివరకు కలిగిన అంతరాయానికి తెరపడింది. విమాన ప్రయాణాలను స్తంభింపజేసిన షట్‌డౌన్‌ను ముగించడాకి ఉద్దేశించిన బిల్లు ఇది. వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కేపిటల్ వద్ద జరిగిన ఓటు సందర్భంగా పలువురు యూఎస్ సెనెటర్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 30 వరకు ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి సవరించిన బిల్లుపై సెనెటర్లు ఓటు వేశారు. ఇందులో మూడు పూర్తి సంవత్సరాల కేటాయింపు బిల్లులు కూడా ఉన్నాయి. ఈ సవరించిన బిల్లు సెనెట్‌ను ఆమోదించింది. తుది ఆమోదం కోసం తిరిగి హౌస్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ తర్వాత దీన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పంపిస్తారు. ఈ ప్రక్రియకు ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. అమెరికాలో షట్‌డౌన్ 40 రోజులు దాటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ ఒత్తిడి మధ్య ఈ మేరకు ద్వైపాక్షిక బిల్లుకు సెనెట్ ఆమోదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే షట్ డౌన్ కొనసాగితే వచ్చే థాంక్స్‌ గివింగ్ సెలవుల్లో ప్రయాణ గందరగోళం ఏర్పడవచ్చని, నాలుగో త్రైమాసిక వృద్ధికి ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు ఇదివరకు వ్యక్తం అయ్యాయి. వీటికి సెనెట్ తెర దించింది. డెమొక్రాట్లతో చర్చలు జరిపిన తర్వాత అఫర్డబుల్ కేర్ యాక్ట్ కింద సబ్సిడీలను పొడిగించడంపై డిసెంబర్‌లో ఓటు వేయడానికి రిపబ్లికన్లు అంగీకరించారు. ఈ తీర్మానం.. షట్‌డౌన్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఫెడరల్ ఉద్యోగుల భారీ తొలగింపులను కొంతమేరకైనా రద్దయ్యే అవకాశం ఉంది. అలాగే సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ప్రయోజనాలకు ఒక సంవత్సరం పాటు పూర్తి నిధులు సమకూరుస్తుంది. ఈ ద్విపక్ష ఒప్పందానికి న్యూ హాంప్‌షైర్ కు చెందిన డెమొక్రాట్ సెనెటర్లు మాగీ హసన్, జీన్ షాహీన్, మెయిన్ స్వతంత్ర సెనెటర్ అంగస్ కింగ్ మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా మీడియా తెలిపింది. సెనెట్ మైనారిటీ నాయకుడు చక్ షుమెర్ దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది డెమొక్రాట్లలో కొనసాగుతున్న అసంతృప్తికి అద్దం పట్టినట్టయింది. ఆదివారం నాటికి షట్‌డౌన్ 40వ రోజుకు చేరుకుంది. ఇది అమెరికా చరిత్రలో సుదీర్ఘమైనది. దీనివల్ల లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులను సెలవుల్లో వెళ్లాల్సొచ్చింది. పలు రకాల సేవలను స్తంభింపజేసింది. నేషనల్ పార్కులన్నీ కూడా మూసివేతకు గురయ్యాయి. ఆహార సరఫరా, దానికి సంబంధించిన సహాయ కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సిబ్బంది కొరత కారణంగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default