నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025లో భారత బాక్సర్లు ఊహించని విజయాన్ని నమోదు చేసి ఏకంగా 9 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. సొంత ప్రేక్షకుల ప్రోత్సాహం నేపథ్యంలో భారత క్రీడాకారులు ప్రదర్శించిన పోరాటం పతకాల పట్టికలో అగ్రస్థానానికి చేర్చింది. టోర్నమెంట్‌లోని 20 మంది భారత బాక్సర్లలో ప్రతి ఒక్కరూ పోడియంపై నిలవడం విశేషం. భారత్ మొత్తం 9 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలతో తన ప్రస్థానాన్ని ముగించింది. ఈ టోర్నమెంట్‌లో భారత మహిళా బాక్సర్లు తమ పంచ్‌లతో పతకాల పంటను పండించారు. మొత్తం 9 స్వర్ణాల్లో 7 స్వర్ణాలు మహిళల విభాగంలోనే రావడం విశేషం. మీనాక్షి (48 కిలోల విభాగం): ఆమె ప్రస్తుత ఆసియా ఛాంపియన్ ఫర్జోనా ఫోజిలోవాపై 5:0తో తిరుగులేని విజయం సాధించింది. ఆమె వేగం, ఖచ్చితత్వం, బలమైన డిఫెన్స్‌తో పాటు మొదటి రౌండ్‌లోనే ఇచ్చిన అద్భుతమైన లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఈ విజయానికి కీలకం. ప్రీతి (54 కిలోలు) ఇటలీకి చెందిన సిరీన్ చర్రాబీని 5:0 తేడాతో ఓడించింది. ఆమె నిరంతర ఒత్తిడి, క్లీన్ స్కోరింగ్ పంచ్‌లు ఆమెకు సునాయాస విజయాన్ని అందించాయి. అరుంధతి చౌదరి (70 కిలోలు) 18 నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన అరుంధతి ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అజీజా జోకిరోవాను 5:0తో చిత్తు చేసింది. నూపుర్ (80+ కిలోలు) ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సోటింబోయేవా ఒల్టినోయ్‌పై 3:2 తేడాతో గెలిచి తన కెరీర్‌లో మొదటి వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ (51 కిలోలు) తన అనుభవాన్ని రంగరించి చైనీస్ తైపీకి చెందిన గువో యీ జువాన్‌ను 5:0తో ఓడించింది. జాస్మిన్ లాంబోరియా (57 కిలోలు) ప్రపంచ ఛాంపియన్ అయిన జాస్మిన్, పారిస్ ఒలింపిక్స్ పతక విజేత వూ షిహ్ యీని 4:1 తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఆత్మవిశ్వాసం, అద్భుతమైన దాడి వ్యూహం, ఒత్తిడిని తట్టుకునే ప్రశాంతత దేశానికి అతిపెద్ద విజయాన్ని అందించాయి. పర్వీన్ (60 కిలోలు) జపాన్‌కు చెందిన అయకా తగుచిపై 3:2 తేడాతో గెలిచింది. వేగవంతమైన కౌంటర్లు, రింగ్‌లో మెరుగైన కదలికలతో ఆమె టైటిల్‌ను గెలుచుకుంది.
పురుషుల విభాగంలో సచిన్ (60 కిలోలు) కిర్గిస్తాన్‌కు చెందిన మునార్బెక్ ఉలు సెయిత్‌బేక్‌ను 5:0 తేడాతో ఓడించాడు. అతను తన పంచ్‌లలో చూపిన ఖచ్చితత్వం, వేగం, నియంత్రణ అతనికి విజయాన్ని అందించాయి. హితేష్ (70 కిలోలు) ఫైనల్స్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటం హితేష్ దే. ప్రారంభంలో వెనుకబడినప్పటికీ, అతను కజకిస్తాన్‌కు చెందిన నూర్బెక్ ముర్సల్‌పై 3:2 తేడాతో విజయం సాధించాడు. ముఖ్యంగా రౌండ్ 2, 3లలో చూపిన కౌంటర్లు, ప్రశాంతమైన ఫినీషింగ్ నైపుణ్యం అతడిని విజేతగా నిలిపాయి. స్వర్ణాలతో పాటు భారత్ ఆరు రజత పతకాలతోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ విజేతలు కూడా కప్ చరిత్రలోనే బలమైన బృందంలో అద్భుత ప్రదర్శన చూపారు: జదుమణి సింగ్ (50 కిలోలు), పవన్ బర్త్వాల్ (55 కిలోలు), అభినాష్ జాంవాల్ (65 కిలోలు), అంకుష్ ఫంగల్ (80 కిలోలు). భారీ విభాగంలో నరేందర్ బెర్వాల్ (90+ కిలోలు) ఉజ్బెకిస్తాన్ బాక్సర్ ఖలీమ్‌జోన్ మామాసోలియేవ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకోగా, మహిళల 80 కిలోల ఫైనల్స్‌లో పూజా రాణి కూడా ఓటమిని చవిచూశారు. ఈ అద్భుతమైన ప్రదర్శన భారత్ బాక్సింగ్‌లో ఒక ప్రపంచ శక్తిగా మారుతోందని స్పష్టం చేస్తోంది.