డీఎంకే ప్రభుత్వంలో అవినీతి : విజయ్‌ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం : డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లిన మార్షల్స్‌

Telugu Lo Computer
0

మిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్‌ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది. డీఎంకే హయాంలో లోన్‌ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్‌ ఆరోపించారు. పార్టీ ఫండ్‌ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్‌ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్‌, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌, మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్‌ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్‌ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్‌ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్‌ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే విజయ్‌ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ స్పష్టం చేశారు. అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. డీఎంకే డిమాండ్‌ను న్యాయశాఖ మంత్రి ఆర్‌.ఎన్‌. నిర్మల్‌కుమార్‌ కూడా వ్యతిరేకించారు. విజయ్‌ చేసిన వ్యాఖ్యలు సర్కారియా కమిషన్‌ నివేదిక, ఈడీ అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఆయన సమర్థించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ఆందోళనకు దిగారు. తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో నినాదాలు కొనసాగుతుండటంతో సభా నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్‌ జోక్యం చేసుకున్నారు. స్పీకర్‌ నిర్ణయం తర్వాత కూడా డీఎంకే సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని స్పీకర్‌ హెచ్చరించారు. ఒక నిమిషంలోపు సీట్లలో కూర్చుంటే కేఎన్‌ నెహ్రూ లేదా ఈవీ వేళుకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళం, అలాగే అనుమతి లేకుండా పోస్టర్లను సభలోకి తీసుకురావడంపైనా స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో చివరకు మార్షల్స్‌ను రంగంలోకి దించారు. స్పీకర్‌ ఆదేశాలతో మార్షల్స్‌ డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. కొందరు సభ్యులు ప్రతిఘటించడంతో వారిని మార్షల్స్‌ బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default