తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మహాబలిపురంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు హోటల్లోనే ఉండాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు సమాచారం. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు విపక్షాలతో బేరసారాలు సాగిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు మినహా ఇతరులెవరూ హోటల్లోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ వ్యవహారం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే కలెక్టర్‌ను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపైనా విజయ్ ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలను ఒకే చోట ఉంచాలన్న నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని తమిళనాడు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
3
Beranda › Posts filed under tamilnadu
Showing posts with label tamilnadu. Show all posts
Showing posts with label tamilnadu. Show all posts
చర్లపల్లి-తిరుచానూరు రైలును సూపర్‌ఫాస్ట్ గా అప్‌గ్రేడ్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
చర్లపల్లి-తిరుచానూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును సూపర్‌ఫాస్ట్ కేటగిరీలోకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం 17047 నంబర్‌తో నడుస్తున్న చర్లపల్లి-తిరుచానూరు ఎక్స్‌ప్రెస్.. సూపర్‌ఫాస్ట్‌గా మారిన తర్వాత 12729 నంబర్‌తో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. చర్లపల్లిలో సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి తిరుచానూరుకు మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు చేరుకుంటుంది. తిరుచానూరులో సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 6:00 గంటలకు చేరుకుంటుంది.
'ఓం' ఆడియో విడుదల వేడుక : అభిమానులకు క్షమాపణలు చెప్పిన ధనుష్
తమిళ హీరో ధనుష్ 'ఓం' ఆడియో విడుదల వేడుకకు ఎంట్రీ పాస్‌లు ఉన్నప్పటికీ లోపలికి అనుమతి లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగిన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత తనదేనని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. చెన్నైలోని సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజీలో నవంబర్ 6న 'ఓం: చాప్టర్ 1 - ఉధిరం: ది బ్లడ్ వుడ్' సినిమా ఆడియో విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నటులను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో ముందుగానే ఎంట్రీ పాస్‌లు పొందారు. అయితే అభిమానుల సంఖ్య భారీగా పెరగడంతో వేదికలోకి అందరికీ ప్రవేశం కల్పించడం సాధ్యపడలేదు. దీంతో చేతిలో పాస్‌లు ఉన్నప్పటికీ పలువురు అభిమానులను లోపలికి అనుమతించలేదు. నిరాశతో వారు వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ధనుష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభిమానులు టికెట్లు చేతిలో పెట్టుకుని కూడా కార్యక్రమానికి హాజరు కాలేక వెనుదిరగడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు ఎవరు కారణమనే విషయాన్ని పరిశీలించదలుచుకోలేదని, పూర్తి బాధ్యత తానే తీసుకుంటున్నానని తెలిపారు. ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ధనుష్‌తో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నాజర్, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
విజయ్ లాగా స్థానిక ఎన్నికల్లో ధనుష్ అభిమానుల పోటీ
నటుడు ధనుష్‌కి చెందిన సంక్షేమ సంఘం (ధనుష్ నర్పణి ఇయక్కమ్) రాబోయే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో సంఘం సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి క్షేత్రస్థాయిలో తమకున్న ప్రజల మద్దతును, పలుకుబడిని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ధనుష్ భవిష్యత్తు రాజకీయ ప్రవేశానికి నాందిగా భావిస్తున్నారు. ఇందులో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన మహిళా సమావేశం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించి మహిళా సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం అధికారికంగా పార్టీ పేరును ప్రకటించకుండానే, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండడానికి సంక్షేమ కార్యక్రమాలు, బాలల అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. నటుడు విజయ్ తన తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడానికి ముందు విజయ్ మక్కల్ ఇయక్కమ్ ద్వారా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధానాన్నే ధనుష్ అభిమాన సంఘం కూడా అనుసరిస్తోంది. ఇప్పటి వరకు నటుడు ధనుష్ కానీ, ఆయన టీమ్ కానీ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వ్యూహాత్మక అడుగులు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఒక నటిగా వత్సలా రాజగోపాల్ ప్రయాణం నేటి తరానికి అత్యంత స్ఫూర్తిదాయకం. ఆమె తన నట జీవితాన్ని తొలుత నాటకరంగం ద్వారా ప్రారంభించారు. దశాబ్దాల పాటు రంగస్థల కళాకారిణిగా అనేక నాటకాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, నాటక ప్రియుల మన్ననలు పొందారు. అయితే, వెండితెరపై ఆమె ప్రయాణం చాలా ఆలస్యంగా మొదలైంది. తన 60 ఏళ్ల వయసులో, 1992లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం రూపొందించిన అఖండ విజయం సాధించిన 'రోజా' చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే తన సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో కలుపుకుని దాదాపు 400లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబ పెద్దగా, కఠినమైన మనస్తత్వం ఉన్న బామ్మగా, అలాగే మనవళ్లు, మనవరాళ్లపై అంతులేని ప్రేమను కురిపించే ఆత్మీయురాలిగా ఆమె పండించిన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వెండితెరపైనే కాకుండా, బుల్లితెరపై కూడా వత్సలా రాజగోపాల్ తన సత్తా చాటారు. అనేక ప్రముఖ తమిళ, తెలుగు టెలివిజన్ సీరియల్స్‌లో నటించి కుటుంబ ప్రేక్షకులకు దశాబ్దాల పాటు వినోదాన్ని పంచారు. ఇక తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే, ఆమె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే బ్లాక్ బస్టర్ సినిమా 'అదుర్స్'. వి.వి. వినాయక్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో వత్సలా రాజగోపాల్.. చారి (ఎన్టీఆర్) బామ్మగా నటించారు. ఆ సినిమాలో ఆమె అద్భుత నటన, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన బామ్మగా ఎన్టీఆర్ తో సాగే హాస్యభరితమైన సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తన సంభాషణలు, హావభావాలతో ఆమె ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
ఏఐఏడీఎంకే రూ. 161.35 కోట్లు, డీఎంకే సుమారు రూ. 191.19 కోట్లు, టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు
తమిళగ వెట్రి కళగం పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో రూ. 13.3 కోట్లు వచ్చాయి.ఈ మొత్తం విరాళాల్లో 99 శాతానికి పైగా సొమ్ము కేవలం ఇద్దరి మంత్రుల నుంచే రావడం గమనార్హం. భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ద్వారా టీవీకే పార్టీ ఇచ్చిన సమాచారంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చింది. నలుగురు దాతల నుండి స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ. 13.3 కోట్లు స్వీకరించినట్లు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇందులో 99 శాతం నిధులు క్రీడలు మరియు ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున, మరో మంత్రి ఆర్.వి. రంజిత్‌కుమార్ నుండే అందాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం ఆదవ్ అర్జున రూ. 8.2 కోట్లు, రంజిత్‌కుమార్ రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం విరాళాలలో 60 శాతానికి పైగా వాటాతో, ఆదవ్ అర్జున ఈ పార్టీకి అతిపెద్ద దాతగా నిలిచారు. వీరితో పాటు, మరో తూత్తుకుడికి చెందిన 'స్నో షో' (Snow Sho) డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 5 లక్షలు ఇచ్చింది. అదే చిరునామాతో ఉన్న 'స్నో ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్' కంపెనీ కూడా DD ద్వారా మరో రూ. 5 లక్షలు విరాళంగా అందించింది. మరోవైపు తమిళనాడులోని ఇతర ప్రధాన పార్టీలకు వచ్చి విరాశాలను పరిశీలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏఐఏడీఎంకే సుమారు రూ. 161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలను పొందినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కోల్‌కతాకు చెందిన 'టైగర్ అసోసియేట్స్' సంస్థ రూ. 135 కోట్లు విరాళంగా ఇచ్చి, అతిపెద్ద దాతగా నిలిచింది.ఇక డీఎంకే సుమారు రూ. 191.19 కోట్ల విరాళాలను స్వీకరించగా, ఇందులో కూడా 'టైగర్ అసోసియేట్స్' సంస్థే రూ. 125 కోట్లతో అతిపెద్ద దాతగా నిలవడం విశేషం. కాగా 'టైగర్ అసోసియేట్స్' సంస్థ ప్రముఖ లాటరీ వ్యాపారి సంటియాగో మార్టిన్‌కు సంబంధించిన వ్యాపార భాగస్వామితో అనుసంధానమై ఉంది. ఈ సంస్థ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ సుబ్బయ్యన్ నాగరాజన్, సంటియాగో మార్టిన్‌కు సుదీర్ఘకాలంగా వ్యాపార భాగస్వామిగా ఉన్నట్లు కార్పొరేట్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి ముందు, మార్టిన్ కు చెందిన 'ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్' సంస్థే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ పథకం ద్వారా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ డీఎంకే పార్టీకి రూ. 509 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు గతంలో బయటపడిన సంగతి తెలిసిందే.
విద్యార్థులు, యువత నిరసనలకు మద్దతు ప్రకటించిన డీఎంకే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలని తీర్మానించారు. విద్యార్థులు, యువత చేపడుతున్న నిరసనలకు డీఎంకే మద్దతు ప్రకటించింది. సీజేపీ నాయకుల అరెస్టులను స్టాలిన్ గతంలో తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసనలను అణచివేసే ప్రయత్నాలు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. సీజేపీ పోరాటానికి డీఎంకే న్యాయపరమైన సహాయం అందిస్తుందని కూడా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీని 'వెన్నుపోటుదారు'గా అభివర్ణించారు. ఆ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
అత్యంత వైభవంగా ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు : భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 20వ తేదీ వరకు అత్యంత నిరాడంబరంగా, వేదమంత్రాల నడుమ ఈ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల క్షేత్రం అపూర్వమైన పూల శోభతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశ విదేశాల నుంచి సేకరించిన రకరకాల సువాసన వెదజల్లే సుందరమైన పుష్పాలతో ఆలయ ప్రాంగణమంతా కళకళలాడుతోంది. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల కోసం టీటీడీ ఉద్యానవన విభాగం సుమారు 60 టన్నుల సంప్రదాయ మరియు విదేశీ పూలను ఉపయోగించింది. గర్భాలయంలో కొలువుదీరిన శ్రీవారి మూలవిరాట్ అలంకరణ కోసం ప్రత్యేకంగా 4.7 టన్నుల అత్యుత్తమ నాణ్యత గల పూలను కేటాయించారు. ధ్వజస్తంభం, బలిపీఠం, మహాద్వారం, రంగనాయకుల మండపం వంటి ప్రధాన ప్రాంతాలను దాదాపు 4 లక్షల కట్ ఫ్లవర్స్‌తో అత్యంత మనోహరంగా అలంకరించారు.వివిధ వాహన సర్వాలు, గోపురాలు, మండపాలు, క్యూలైన్ల అలంకరణను కలుపుకుంటే మొత్తం దాదాపు 70 టన్నుల పూలతో తిరుమల క్షేత్రం దివ్యశోభను సంతరించుకుంది. ఉత్సవాల సమయంలో ప్రతిరోజూ వివిధ వాహనాలపై భక్తులకు అభయమివ్వనున్న శ్రీమన్నారాయణుడు, ఈ ప్రత్యేక పుష్పాలంకరణల మధ్య మరింత దివ్యంగా దర్శనమిస్తున్నారు. ఈ అద్భుతమైన అలంకరణలను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న వేలాది మంది భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది.
Read More...
తిరువళ్లువర్‌ను కాషాయ రంగుతో చిత్రీకరించడం ద్వారా ఆయనను సొంతం చేసుకోలేరు : తమిళగ వెట్రి కజగం
ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ను బీజేపీ కాషాయ వస్త్రధారణలో చిత్రీకరించడంపై తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరువళ్లువర్‌ను ఒక ప్రత్యేక మతానికి పరిమితం చేయలేరని స్పష్టం చేసింది. అక్టోబర్ 11న చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పోరూర్ ప్రాంతంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో తిరువళ్లువర్‌ను కాషాయ వస్త్రధారణలో చూపించారు. తమిళ సాహిత్యంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన తిరువళ్లువర్‌ను ఒక ప్రత్యేక మతానికి చెందిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ ఈ చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తిరువళ్లువర్‌ను కాషాయ రంగుతో చిత్రీకరించడం ద్వారా ఆయనను సొంతం చేసుకోలేరని టీవీకే పేర్కొంది. తిరువళ్లువర్ తమిళ ప్రజలకే కాకుండా మొత్తం మానవాళికి చెందిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించింది. తిరుక్కురళ్ ద్వారా ఆయన ప్రపంచానికి నైతిక విలువలను అందించారని, ఆయన బోధనలను ఒక ప్రత్యేక మతానికి పరిమితం చేయడం సరికాదని పేర్కొంది. తిరువళ్లువర్‌ను కాషాయీకరించే ప్రయత్నాలను తమిళ ప్రజలు అంగీకరించరని టీవీకే హెచ్చరించింది. తమిళ భాష, తమిళ ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.
సీఎం విజయ్ తో కలిసి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 సేవలను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
తమిళనాడుకు ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తో కలిసి చెన్నై మెట్రో రైల్ ఫేజ్-2 సేవలను లాంఛనంగా ప్రారంభించారు. చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రధాని మోడీకి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నాయకులు పోరూర్ బైపాస్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని ఫేజ్-2 తొలి రైలు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. చెన్నై మెట్రో ఫేజ్-2 కారిడార్-4 పరిధిలోని పూందమల్లి నుంచి పోరూర్ బైపాస్ మధ్య రూపుదిద్దుకున్న ఈ నూతన మార్గంలో ప్రధాని మోడీ, సీఎం విజయ్ కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. రైలు ప్రయాణ సమయంలో మెట్రో ప్రాజెక్టు విశేషాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు వారికి వివరించారు. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీతో కలిసి ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడంతో, రాజకీయ వర్గాల్లో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఫేజ్-2 ప్రాజెక్టు ప్రారంభంతో చెన్నై పశ్చిమ ఉపనగరాల నుంచి నగర కేంద్రానికి రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా కష్టాలు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే ఈ మార్గంలో డ్రైవర్ రహిత నౌకాయాన సాంకేతికతకు అనుగుణంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ప్రధాని మోడీ, సీఎం విజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించడం స్థానికంగా ఉత్సాహాన్ని నింపింది. మెట్రో ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోడీ ఐఐటీ మద్రాస్ వేదికగా మరికొన్ని రోడ్డు, రైల్వే మరియు షిప్పింగ్ రంగాలకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
సీఎం విజయ్ నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ : గంటకు పైగా సమావేశం : కేఫ్‌కు వెళ్లి కాఫీ, తిరమిసు, కుకీస్‌ను రుచి చూసిన నేతలు
చెన్నైలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ శనివారం సమావేశమయ్యారు. విజయ్ నివాసంలోనే ఇద్దరు నేతలు సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం సమీపంలోని కేఫ్‌కు వెళ్లి కాఫీ, తిరమిసు, కుకీస్‌ను రుచి చూశారు. దీంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న తన నివాసానికి వచ్చిన రాహుల్ గాంధీకి విజయ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ రాజకీయ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కేఫ్‌కు వెళ్లిన నేతలు అక్కడికి వచ్చిన అభిమానులతో ముచ్చటించారు. అనంతరం కొందరితో సెల్ఫీలు దిగారు. రాహుల్ గాంధీ చెన్నైలో నిర్వహిస్తున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' పేరుతో జరగనున్న యువజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చెన్నైలో ముగిసిన సింగీతం శ్రీనివాసరావు అంత్యక్రియలు
చెన్నైలోని నేసపాక్కం శ్మశానవాటికలో లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దశాబ్దాల పాటు విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఒక గొప్ప శకం ముగియడంతో, సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన భౌతికకాయాన్ని చెన్నై విరుగంబాక్కంలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుని పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ‘పుष्పక విమానం’, ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేಲ್ మదన కామరాజు’ వంటి ఎన్నో అద్భుతమైన, చారిత్రక చిత్రాలను రూపొందించిన విశ్వనటుడు కమల్ హాసన్… స్వయంగా ఆయన నివాసానికి చేరుకున్నారు. గురుసమానులైన సింగీతం భౌతికకాయాన్ని చూసి ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వీరిద్దరి కలయిక భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సహా అగ్ర భారతీయ సినీ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. భారతీయ సినిమాలో నూతన ఒరవడులకు, ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టిన సింగీతం లేని లోటు పరిశ్రమకు ఎన్నటికీ తీరనిదని కొనియాడారు.
Read More...
అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త !
చెన్నై లోని మాంగాడు సమీపంలో పట్టూరు ప్రాంతంలో ముజైదీన్ అనే వ్యక్తి భార్య సోఫియాను మాంసం నరికే కత్తితో నరికి చంపి పారిపోయాడు. మాంగాడు బస్ స్టేషన్లో ముజైదీన్ ను అరెస్టు చేసి పోలీసులు విచారించగా ముజైదీన్ తన వాంగ్మన్లో సంచలన సమాచారాన్ని ఇచ్చాడు. మాంగాడు సమీపంలోని పట్టూరు ప్రాంతానికి చెందిన ముజైదీన్ (30) , ఆ ప్రాంతంలోని ఒక మాంసం దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. 8 సంవత్సరాల క్రితం సోఫియా (26) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. ఈ స్థితిలో గత కొన్ని నెలలుగా ముజైదీన్ మద్యానికి బానిసయ్యాడు. చికిత్స కోసం అతన్ని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించారు. కొన్ని రోజులుగా మద్యం తాగని ముజైదీన్, ఆ తర్వాత మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో కుటుంబాన్ని కోసం స్థానిక బట్టల దుకాణంలో పనిమనిషిగా సోఫియా పనిచేస్తుంది. ఆమె రోజూ పనికి వెళ్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన ఒక ఆటో డ్రైవర్ తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడిందని, చాలా కాలంగా ఫోన్లో మాట్లాడుకుంటోందని ముజైదీన్కు తెలిసింది. కుటుంబ సభ్యుల సలహాతో ఆమె కొంతకాలం పాటు ఆ ఆటో డ్రైవర్ తో ఫోన్లో మాట్లాడలేదు. అయితే, ముజైదీన్కు తన భార్య పై అనుమానం వచ్చి ఆమెను కొట్టాడు. సోఫియా బుధవారం రాత్రి చాలా సేపు ఆమె తన స్నేహితురాలితో సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా చూసి, మళ్లీ ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతోందని అనుమానించిన ముజైదీన్, మద్యం మత్తులో సోఫియాను మాంసం నరికే కత్తితో నరికి చంపాడు.
Read More...
నవంబర్ 13న 'గీతాంజలి' తెలుగు, తమిళ భాషల్లో రీ-రిలీజ్
ప్రపంచవ్యాప్తంగా 4K వెర్షన్లో 'గీతాంజలి' గ్రాండ్‌గా నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో రీ-రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుతమైన కథనం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, గొప్ప సంగీతంతో ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, అందమైన అనుభూతులను ప్రత్యేకమైన శైలిలో ఆవిష్కరించింది. ఇప్పటివరకు 'గీతాంజలి'ని ప్రేమించిన ప్రేక్షకులకు ఈ 4K రీ-రిలీజ్ మరోసారి ఆ మధురానుభూతిని థియేటర్లో అందించనుంది. పిక్చర్ క్వాలిటీ, విజువల్ డీటెయిలింగ్‌తో సినిమా మరింత గ్రాండ్‌గా కనిపించనుంది. అదే సమయంలో ఒరిజినల్ సినిమా అందించిన ఎమోషన్, చార్మ్‌ను ఎలాంటి మార్పు లేకుండా ప్రేక్షకులకు అందించనున్నారు. ఇళయరాజా అందించిన సంగీతం 'గీతాంజలి'కి ఇప్పటికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆయన స్వరపరిచిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవర్ గ్రీన్. బూర్లె శివ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ పద్మిని సినిమాస్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్‌ను మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రేమించిన అభిమానులతో పాటు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా 'గీతాంజలి'ని బిగ్ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది.
Read More...
'ధర్మన్'లో హీరో రామ్ : రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేసిన రాశీఖన్నా
మరో రెండు వారాల్లో 'జైలర్ 2'తో థియేటర్లలోకి రాబోతున్న రజనీకాంత్ ప్రస్తుతం 'ధర్మన్' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రూమర్స్‌గానే ఉన్న ఓ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాశీఖన్నా బయటపెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. 'ధర్మన్' షూటింగ్ మైసూరులో జరుగుతుండటంతో అక్కడి దోశ, షూటింగ్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసిన రాశీఖన్నా, తెలుగు హీరో రామ్ ఈ మూవీలో నటిస్తున్నాడనే సంగతి రివీల్ చేసింది. గతంలో పుకార్లు వచ్చాయి. ఇప్పుడు రాశీ, రజనీ-రామ్‌తో కలిసున్న ఫొటో పోస్ట్ చేయడంతో ఇది నిజమేనని క్లారిటీ వచ్చింది. ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా నటిస్తుండగా.. ఈమెకు ప్రియుడిగా నెగిటివ్ టచ్ ఉన్న విలనీ తరహా పాత్రలో రామ్ కనిపించబోతున్నాడట. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' తీసిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్‌తో దీన్ని రెడీ చేస్తున్నారు.
28న మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభం
తమిళనాడులోని ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించే పసిపిల్లలకోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకాన్ని ఈ నెల 28న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని తొలుత ఉసిలంపట్టి ప్రాంతంలో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ, తగిన భద్రతాపరమైన కారణాలరీత్యా చివరి నిమిషంలో వేదికను మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి మార్చడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి విజయ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. తన చేతుల మీదుగా తొలి విడతలో ఎంపిక చేసిన 50 మంది నవజాత శిశువులకు ఒక గ్రాము బరువుగల బంగారు ఉంగరాలను ఆయన స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వైద్య సేవలను ప్రోత్సహించడంతో పాటు పేద కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకం కేవలం ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జన్మించే శిశువులందరికీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య విధానాన్ని నమ్మి ప్రసవాలు జరిగేలా తల్లులను ప్రోత్సహించడమే ఈ పథకపు ప్రధాన ఉద్దేశం. ఈ వినూత్న సంక్షేమ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
Read More...
తనపై దొంగతనం నేరం మోపడం మానసికంగా ఎంతో కలచివేసింది : అంబిక
నటి అంబిక తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తూ, రాధ ఫిర్యాదును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బహిరంగంగా సవాల్ విసిరారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన కుటుంబ వివాదాన్ని మీడియా ముందుకు తీసుకురావడం తీవ్ర బాధ కలిగించిందని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. రాధ నివాసంలోని గదిలోకి చొరబడి తాను చెక్కులను దొంగిలించాననడంలో ఎంతమాత్రం వాస్తవం లేదని చెప్పారు. అసలు రాధకు తెలియకుండా ఆమె గదిలో నుంచి చెక్కులు ఎలా తీసుకోగలమని ప్రశ్నించిన అంబిక, స్వయంగా రాధే ఆ చెక్కులను తనకు అందజేసిందని వెల్లడించారు. ''చెక్కులను స్వయంగా ఇచ్చింది రాధే, ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి పేమెంట్లను ఉద్దేశపూర్వకంగా ఆపేసింది కూడా రాధే'' అని స్పష్టం చేశారు. సొంత తోబుట్టువు అయి ఉండి తనపై దొంగతనం నేరం మోపడం మానసికంగా ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ చెక్కుల వివాదం వెనుక సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబ ఆస్తులు, వ్యాపార లావాదేవీల అంశాలు ఉన్నాయని అంబిక వివరించారు. ముఖ్యంగా 'ఏఆర్ఎస్ గార్డెన్స్'తో తమ కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ సంస్థను తన కన్నబిడ్డలా భావించానని భావోద్వేగానికి లోనయ్యారు. అటువంటి సంస్థ పేరును తన ప్రమేయం లేకుండా 'ఆర్ఆర్ గార్డెన్స్'గా మార్చడం తనను ఎంతగానో క్షోభకు గురిచేసిందన్నారు. అలాగే ఆస్తులు, వ్యాపారంతో పాటు బంగారు ఆభరణాల విషయంలోనూ తమ మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయని, తమ కుటుంబానికి చెందిన విలువైన బంగారు నగలు కూడా రాధ వద్దే ఉన్నాయని ఆమె ఎదురు ఆరోపణలు చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి తాను గతంలోనే సంబంధిత అధికారులను సైతం ఆశ్రయించానని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో చట్టపరమైన పోరాటానికి అంబిక సిద్ధమయ్యారు. రాధ ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ కావడంతో, ఆమెపై చట్టప్రకారం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అంబిక తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రాధ పోలీసులకు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదును న్యాయస్థానంలో సవాలు చేస్తామని తెలిపారు. ఇకపై ఈ కుటుంబ సమస్యను పదేపదే మీడియా ముందుకు తీసుకురాబోనని, చట్టం, అధికారుల నిర్ణయానికే తుది న్యాయాన్ని వదిలేస్తున్నానని అంబిక స్పష్టం చేశారు.
Read More...
పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం : 8వ తరగతి వరకు విస్తరింపు
చెన్నై తిరువాన్మియూర్లోని గాంధీ గ్రామం ప్రభుత్వ మిడిల్ స్కూల్లో పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం విస్తరణను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి పొంగల్ తిన్నారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇప్పటివరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు అందుతున్న ఈ పథకాన్ని తాజాగా 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా వర్తింపజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 15.30 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఈ విస్తరణ 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో అమలుకానుంది. విద్యార్థులు ఉదయం అల్పాహారం లేకుండా పాఠశాలకు రావాల్సిన పరిస్థితిని తగ్గించడం, వారికి పోషకాహారం అందించడం, తరగతుల్లో ఏకాగ్రత పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. విస్తరణ కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించడంతో.. పథకం మొత్తం బడ్జెట్ రూ.724 కోట్లకు చేరింది. విద్యార్థులకు అందించే మెనూలో పొంగల్, సాంబార్, స్వీట్ వంటి అల్పాహార పదార్థాలు ఉన్నాయి. ఈ పథకానికి గతంలో 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'గా పేరు ఉండగా 2026లో మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజర్ పేరు మీదుగా 'పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకం'గా పేరు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి విస్తరణ అమల్లోకి వచ్చింది. అయితే చెంగల్పట్టు, తిరుప్పూర్ జిల్లాల్లో ఉపఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో అక్కడ ఈ విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. మొత్తంగా 6-8 తరగతుల విద్యార్థులను కూడా చేర్చడంతో తమిళనాడులో ఉచిత ఉదయపు భోజన పథకం పరిధి మరింత విస్తరించింది.
Read More...
వంద కోట్ల క్లబ్ లో చేరిన 'మందాడి' సినిమా
మందాడి సినిమా నిన్న ఒక్క రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా వసూళ్లు రాబట్టడంతో వరల్డ్‌వైడ్‌గా రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. బాక్సాఫీస్ ట్రాకింగ్ నివేదికల ప్రకారం 11వ రోజు రూ.8 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అంచనాలు వేసినట్టే ఈ వీకెండ్లో ఈ మూవీ వసూళ్లలో భారీగా పుంజుకుంది. శనివారం ఇండియాలో 6.55 కోట్లు రాబట్టిన ఈ మూవీ నిన్న 8 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. విడుదలయ్యాక రెండవ ఆదివారం కూడా ఈ సినిమాకు వసూళ్లలో ఈ స్థాయి జోరు చూపించడం గమనార్హం. ఈ మూవీకు విడుదలయ్యాక రివ్యూలు మిశ్రమంగా వచ్చాయి. అయినప్పటికీ అవేమీ మూవీ వసూళ్లపై ప్రభావాన్ని చూపించలేదు. విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ వచ్చింది. నిన్న దేశవ్యాప్తంగా 3,865 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమాకు 38.8 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీ నమోదైంది. అంతకుముందు రోజు రూ.6.55 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు రాబట్టిన 'మండాడి' 11వ రోజు ఏకంగా 22.1 శాతం గ్రోత్ నమోదు చేసింది. దీంతో 11 రోజులకు కలిపి 'మందాడి' సినిమా మొత్తం దేశవ్యాప్త నెట్ కలెక్షన్స్ రూ.75.55 కోట్లకు చేరుకున్నాయి. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ.88.32 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్లో 11వ రోజు రూ.0.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో.. అక్కడ ఇప్పటివరకు మొత్తం రూ.15.40 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో 11 రోజుల్లో 'మండాడి' ప్రపంచవ్యాప్తంగా రూ.103.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
పుకార్లకు చెక్ పెట్టిన విజయ్ సేతుపతి : ‘జైలర్ 2’ సీక్వెల్లో తాను భాగమైనట్లు ప్రకటన
తమిళ బిగ్‌బాస్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అవి నేరుగా సీఎం విజయ్ను టార్గెట్ చేస్తూ అన్న మాటలేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదాలపై తాజాగా ఓ వేదికపై స్పందించిన విజయ్ సేతుపతి సీఎం విజయ్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ పుకార్లకు చెక్ పెట్టారు. “ఒకసారి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ బర్త్ డే సందర్భంగా నేను ఫోన్ చేసి విషెస్ చెప్పాను. అది గమనించిన విజయ్ సర్ నేరుగా నాకే ఫోన్ చేశారు. ‘డియర్ ఫ్రెండ్’ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మీరు విష్ చేయడం మా అబ్బాయికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అంతటి తిరుగులేని సూపర్ స్టార్ స్థాయి ఉన్న వ్యక్తి నుంచి అలా ఫోన్ రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన అంత పెద్ద స్టార్ అయినా వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా ఉంటారు” అంటూ విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం ఉందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. మరోవైపు, సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ సీక్వెల్లో తాను కూడా భాగమైనట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో ఒక చిన్న సీన్లో మాత్రమే కనిపిస్తానని స్పష్టం చేశారు. కేవలం చిన్న సన్నివేశమే అయినప్పటికీ, రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకెంతో ప్రత్యేకం అని అన్నారు.
Subscribe to:
Posts (Atom)










