విజయ్‌ లాగా స్థానిక ఎన్నికల్లో ధనుష్‌ అభిమానుల పోటీ

నటుడు ధనుష్‌కి చెందిన సంక్షేమ సంఘం (ధనుష్‌ నర్పణి ఇయక్కమ్‌) రాబోయే తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో సంఘం సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి క్షేత్రస్థాయిలో తమకున్న ప్రజల మద్దతును, పలుకుబడిని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ధనుష్‌ భవిష్యత్తు రాజకీయ ప్రవేశానికి నాందిగా భావిస్తున్నారు. ఇందులో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన మహిళా సమావేశం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వరుస సమావేశాలు నిర్వహించి మహిళా సంఘాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం అధికారికంగా పార్టీ పేరును ప్రకటించకుండానే, ప్రజలతో నిరంతరం అనుసంధానమై ఉండడానికి సంక్షేమ కార్యక్రమాలు, బాలల అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. నటుడు విజయ్‌ తన తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడానికి ముందు విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ ద్వారా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధానాన్నే ధనుష్‌ అభిమాన సంఘం కూడా అనుసరిస్తోంది. ఇప్పటి వరకు నటుడు ధనుష్‌ కానీ, ఆయన టీమ్‌ కానీ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ వ్యూహాత్మక అడుగులు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3