Monday, October 19, 2026

ఏఐఏడీఎంకే రూ. 161.35 కోట్లు, డీఎంకే సుమారు రూ. 191.19 కోట్లు, టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు

తమిళగ వెట్రి కళగం పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపంలో రూ. 13.3 కోట్లు వచ్చాయి.ఈ మొత్తం విరాళాల్లో 99 శాతానికి పైగా సొమ్ము కేవలం ఇద్దరి మంత్రుల నుంచే రావడం గమనార్హం. భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ద్వారా టీవీకే పార్టీ ఇచ్చిన సమాచారంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చింది. నలుగురు దాతల నుండి స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ. 13.3 కోట్లు స్వీకరించినట్లు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఈసీకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇందులో 99 శాతం నిధులు క్రీడలు మరియు ప్రజాపనుల శాఖ మంత్రి ఆదవ్ అర్జున, మరో మంత్రి ఆర్.వి. రంజిత్‌కుమార్ నుండే అందాయి. ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం ఆదవ్ అర్జున రూ. 8.2 కోట్లు, రంజిత్‌కుమార్ రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం విరాళాలలో 60 శాతానికి పైగా వాటాతో, ఆదవ్ అర్జున ఈ పార్టీకి అతిపెద్ద దాతగా నిలిచారు. వీరితో పాటు, మరో తూత్తుకుడికి చెందిన 'స్నో షో' (Snow Sho) డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 5 లక్షలు ఇచ్చింది. అదే చిరునామాతో ఉన్న 'స్నో ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్' కంపెనీ కూడా DD ద్వారా మరో రూ. 5 లక్షలు విరాళంగా అందించింది. మరోవైపు తమిళనాడులోని ఇతర ప్రధాన పార్టీలకు వచ్చి విరాశాలను పరిశీలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏఐఏడీఎంకే సుమారు రూ. 161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలను పొందినట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కోల్‌కతాకు చెందిన 'టైగర్ అసోసియేట్స్' సంస్థ రూ. 135 కోట్లు విరాళంగా ఇచ్చి, అతిపెద్ద దాతగా నిలిచింది.ఇక డీఎంకే సుమారు రూ. 191.19 కోట్ల విరాళాలను స్వీకరించగా, ఇందులో కూడా 'టైగర్ అసోసియేట్స్' సంస్థే రూ. 125 కోట్లతో అతిపెద్ద దాతగా నిలవడం విశేషం. కాగా 'టైగర్ అసోసియేట్స్' సంస్థ ప్రముఖ లాటరీ వ్యాపారి సంటియాగో మార్టిన్‌కు సంబంధించిన వ్యాపార భాగస్వామితో అనుసంధానమై ఉంది. ఈ సంస్థ డెసిగ్నేటెడ్ పార్ట్‌నర్ సుబ్బయ్యన్ నాగరాజన్, సంటియాగో మార్టిన్‌కు సుదీర్ఘకాలంగా వ్యాపార భాగస్వామిగా ఉన్నట్లు కార్పొరేట్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేయడానికి ముందు, మార్టిన్ కు చెందిన 'ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్' సంస్థే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఆ పథకం ద్వారా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ డీఎంకే పార్టీకి రూ. 509 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు గతంలో బయటపడిన సంగతి తెలిసిందే.