Monday, October 19, 2026

శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్ కారిడార్‌కు సమీపంలో హైయర్ అత్యాధునిక తయారీ కేంద్రం ఏర్పాటు !

భారతదేశంలోనే లార్జెస్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసేందుకు గ్లోబల్ హోమ్ అప్లయన్సెస్ దిగ్గజం హైయర్ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. దక్షిణ భారతదేశంలో ఒక భారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు సంస్థ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య గల అవకాశాలను తీవ్రంగా పరిశీలించింది. పరిశ్రమల స్థాపనకు గట్టి పోటీనిచ్చే తమిళనాడును వెనక్కినెట్టి, ఏపీ ప్రభుత్వం అందించిన అనుకూల పారిశ్రామిక విధానాలు, వేగవంతమైన అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాల కారణంగా అంతిమంగా ఆంధ్రప్రదేశ్‌ ఈ పారిశ్రామిక యుద్ధంలో విజయం సాధించింది. దాదాపు రూ.7,000 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఊపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా 6,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, అనుబంధ రంగాలు, రవాణా, ప్యాకేజింగ్, సప్లై చైన్ విభాగాల్లో మరో 15,000 పరోక్ష ఉద్యోగాలు సమకూరనున్నాయి. మొత్తంగా దాదాపు 21,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. పూణె, గ్రేటర్ నోయిడాలలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న హైయర్ సంస్థకు, దక్షిణ భారత దేశంలో ఇది అత్యంత కీలకమైన, భారీ ఉత్పాదక కేంద్రంగా మారనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో, చెన్నై-నెల్లూరు-శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్ కారిడార్‌కు సమీపంలో ఈ అత్యాధునిక తయారీ కేంద్రాన్ని రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ ఎయిర్ కండీషనర్లు , రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్లు తదితర గృహోపకరణాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే సమీపంలోని శ్రీసిటీలో ఎల్జీ వంటి గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు తమ తయారీ కేంద్రాలను విస్తరిస్తుండగా, ఇప్పుడు హైయర్ కూడా పక్కనే భారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుండటం వల్ల ఈ ప్రాంతం దేశంలోనే అతిపెద్ద కన్స్యూమర్ డ్యూరబుల్స్ , ఎలక్ట్రానిక్స్ హబ్‌గా అవతరించనుంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు చేస్తున్న కృషికి ఈ భారీ పెట్టుబడి నిదర్శనంగా నిలుస్తోంది. పొరుగున ఉన్న తమిళనాడు వంటి బలమైన ఉత్పాదక రాష్ట్రాన్ని అధిగమించి ఇంతటి భారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించగలగడం కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాల విజయమని అభిప్రాయపడుతున్నారు.