Monday, October 19, 2026

భారత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా ఎంపిక

భారత పురుషుల క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా ఎంపికయ్యాడు. అజిత్ అగార్కర్ స్థానంలో ఓజా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే తాత్కలిక చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓజా ఇక నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించనున్నాడు. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి కాలం అక్టోబర్ 4న ముగిసిన సంగతి తెలిసిందే. తన పదవి కాలాన్ని పొడిగించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అజిత్ అగార్కర్ నిష్క్రమణతో ఖాళీ అయిన వెస్ట్ జోన్ సెలెక్టర్ పదవికి టీమిండియా మహిళల మాజీ కోచ్ రమేశ్ పవార్‌తో పాటు వసీం జాఫర్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ రమేశ్ పవార్‌నే బీసీసీఐ ఎంపిక చేసింది. రమేశ్ పవార్ భారత్ తరఫున 2 టెస్ట్‌లు, 31 వన్డేలు ఆడాడు. భారత మహిళల జట్టుకు కోచ్‌గానూ పనిచేసిన అనుభవం ఉంది. వెస్ట్ జోన్ సెలెక్టర్‌గా పవార్ ఎంపికవ్వడంతో తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజాకు మార్గం సుముగమైంది. గతేడాది సెప్టెంబర్‌లోనే ప్రజ్ఞాన్ ఓజా సౌత్ జోన్ నుంచి సెలెక్టర్‌గా నియమితులయ్యాడు. భారత్ తరఫున 24టెస్ట్‌లు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. ప్రజ్ఞాన్ ఓజా సారథ్యంలోని సెలెక్షన్ కమిటీనే 2027 వన్డే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయనుంది. ఇప్పటికే తాత్కలిక చీఫ్ సెలెక్టర్‌గా వెస్టిండీస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనలకు ప్రజ్ఞాన్ ఓజా జట్లను ఎంపిక చేశాడు.