Monday, October 19, 2026

అల్బేనియాలో హింసాత్మకంగా మారిన ప్రజా నిరసనలు : పార్లమెంటుపై పెట్రోల్ బాంబులతో దాడి

అల్బేనియా రాజధాని టిరానా లో ప్రతిపక్షాలు, విద్యార్థులు చేపట్టిన ప్రజా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. అవినీతి ఆరోపణలు, జీవన వ్యయం, విద్యా ఖర్చుల సంక్షోభం కారణాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, విద్యార్థులు, ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. మాస్కులు ధరించిన నిరసనకారులు ప్రభుత్వ భవనాలు, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాలతో పాటు పార్లమెంటు భవనంపైకి రాళ్లు, పెట్రోల్ బాంబులు, బాణసంచా విసరడంతో పలు చోట్ల మంటలు చెలరేగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్లు , రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. గత వారం రోజులుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 130 మందికి పైగా పోలీసు అధికారులు, వందలాది మంది నిరసనకారులు గాయపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.డిప్యూటీ పీఎం బెలిండా బల్లుకుపై వచ్చిన అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు ఈ నిరసనలు మరింత హింసాత్మకంగా మార్చాయి.