Monday, October 19, 2026

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్ధల ఎన్నికలు : మరో రెండు రోజులు మద్యం షాపుల బంద్

ఆంధ్రప్రదేశ్ లో  స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వరుసగా మద్యం షాపుల్ని మూసి ఉంచాల్సిన పరిస్దితులు తలెత్తుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస ప్రకటనలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం దుకాణాలను మున్సిపల్ ఎన్నికల సమయంలో రెండు రోజుల పాటు మూసి ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇవాళ మరో రెండు రోజుల పాటు మద్యం షాపుల్ని బంద్ చేయబోతున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు జరుగుతున్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల, నగర పంచాయతీల పరిధిలో అక్టోబర్ 27, 28 తేదీలతో పాటు కౌంటింగ్ జరిగే 30వ తేదీ కూడా మద్యం షాపుల్ని బంద్ చేయబోతున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే షాపులు బంద్ చేయాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇలా షాపులు బంద్ చేయబోతున్నారు. అలాగే కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసి ఉంచనున్నారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ విడుదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ మేరకు.. నవంబర్ 2, 3 తేదీల్లో సైతం మద్యం షాపుల్ని మూసివేయబోతున్నారు. నవంబర్ 3న రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఈ పోలింగ్ నవంబర్ 3వ తేదీన సాయంత్రం ముగియనుంది. దీనికి 48 గంటల ముందు నుంచీ అంటే నవంబర్ 2వ తేదీ ఉదయం నుంచే మద్యం షాపుల్ని మూసేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రెండు రోజులు కూడా మద్యం దుకాణాలు మూసివేయబోతున్నారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా మద్యం దుకాణాలు బంద్ చేస్తారు. వీటిపై విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ఈ ఆదేశాలు ఇస్తుంటుంది.