భారతీయ వినియోగదారులను తమ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలని వాట్సాప్ కోరుతున్నట్లు సమాచారం. దీంతో వాట్సాప్ వయస్సు ధృవీకరణ నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతోందా?.. అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో యూజర్లను పుట్టిన తేదీని నమోదు చేయమని కోరుతున్నట్లు కనిపించింది. బహుశా భారత ప్రభుత్వం నిబంధనల కారణంగా ఈ అప్డేట్ తీసుకొస్తోందా? అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా నిజమని నమ్మలేము. అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలి. వాట్సాప్ యూజర్ల వయస్సు అడగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సందర్భాల్లో ఖాతా ప్రారంభించే సమయంలో లేదా కొన్ని ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించే సమయంలో వయస్సును నిర్ధారించేందుకు వాట్సాప్ ఈ వివరాలను అడుగుతుంది. ఇప్పుడు కూడా బహుశా ఇలాంటిదే యూజర్లకు కనిపించి ఉండవచ్చు. వివిధ దేశాల్లో అమలవుతున్న కొత్త చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కోసం.. వయస్సు సమాచారం కూడా చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. వినియోగదారులకు వారి వయస్సుకు సరిపోయే సేవలను అందించేందుకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మెటా ఏఐ ఫీచర్లు, స్టేటస్, ఛానల్స్‌లో కనిపించే ప్రకటనల విషయంలో కూడా వయస్సు ఆధారంగా అనుభవాన్ని అందించేందుకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.
వాట్సాప్ వయస్సు ధృవీకరణ నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతోందా?
August 02, 2026
0
Tags