సమ్మక్క-సారక్క ప్రాజెక్టు : ఎన్ఓసీ పత్రం జారీ చేయాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినతి

Telugu Lo Computer
0

గోదావరి నదిపై తలపెట్టిన సమ్మక్క-సారక్క బ్యారేజ్/సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనలో మరో కీలక ముందడుగు పడినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. అనంతరం నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి ఆయనతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తలపెట్టిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం జారీ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ వినతి పత్రాన్ని సమర్పించారు. సమ్మక్క-సారక్క బ్యారేజ్ రాష్ట్ర రైతాంగానికి అత్యంత కీలకమైన ప్రాజెక్టు అని వివరించారు. విష్ణుదేవ్ సాయి ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఈ పరిణామం ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందన్నారు. కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి వెల్లడించారు. ఎన్‌వోసీ లేనందునే డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని విష్ణుదేవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని, మరింత ఖచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ కోరగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని చెప్పారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default