భారత సంతతికి చెందిన 47 ఏళ్ల రాకేష్ నారాయణ్ పాయ్, 46 ఏళ్ల అదితి విజయ్ పారాల్కర్‌లు భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ పాయ్ పారాల్కర్ ఉన్నాడు. వీరంతా దక్షిణ లండన్‌లోని ఎలిఫెంట్ అండ్ క్యాజిల్ పరిధిలోని చర్చియార్డ్ రోలో ఉన్న 'హైపాయింట్' అనే 45 అంతస్తుల విలాసవంతమైన అపార్ట్‌మెంట్ టవర్‌లోని 36వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. అయితే మే 27వ తేదీ ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో వీరు ముగ్గురూ 36వ అంతస్తు నుంచి కింద పడ్డారు. ఒక్కసారిగా భారీ శబ్దం అవుతూ వారు కింద పడడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారి వద్దకు పరుగులు పెట్టారు. మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులతో పాటు లండన్ అంబులెన్స్ సర్వీస్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ఆ ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బ్రిటీష్ మీడియా కథనాల ప్రకారం మాత్రం రాకేష్‌యే తన భార్య, కుమారుడిని చంపేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నట్లు వివరిస్తున్నారు. ఇందుకు కారణాలను కూడా సదరు సంస్థలు వెల్లడించాయి. వీరు సొంతంగా ఒక కన్సల్టెన్సీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే తొమ్మిదేళ్ల క్రితమే వీరికి కుమారుడు సిద్ పుట్టాడు. అయితే అతడు ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యూకేలోనే జన్మించిన తొమ్మిదేళ్ల సిద్‌కు మాటలు రావు. దాంతో పాటు అతనికి తీవ్రమైన లెర్నింగ్ డిసేబిలిటీస్, పాక్షిక అంగవైకల్యం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు వారి స్నేహితులు మీడియాకు తెలిపారు. బాబును చూసుకోవడం, అతని అనారోగ్య సమస్యల కారణంగా ఆ దంపతులు ఇద్దరూ విపరీతమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తల్లి అదితి ఈ ఒత్తిడిని తట్టుకోలేక తీవ్రమైన డిప్రెషన్, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతోందని ఆమె స్నేహితురాలు ఒకరు పేర్కొన్నారు. ఓవైపు భార్య, మరోవైపు కుమారుడి ఆరోగ్య పరిస్థితి చూడలేక.. రాకేష్‌యే వీరిన చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావించారు. ఇదే విషయాన్ని వారి స్నేహితుల వద్ద ప్రస్తావించగా అలా జరిగే అవకాశం లేదని వారు తెలిపారు. అదితి మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ.. రాకేష్ ఎప్పుడూ చాలా ప్రశాంతంగా, ధైర్యంగా ఉండేవాడని, అందుకే ఈ ఘటన తమకు నమ్మశక్యంగా లేదని వారు వాపోతున్నారు. అయితే ఈ మరణాల వెనుక ఉన్న అసలు నిజాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లోనూ వేగంగా దర్యాప్తు జరుపుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం స్పష్టం చేసింది. యాక్టింగ్ డిటెక్టివ్ సూపరింటెండెంట్ డాన్ విట్టెన్ మాట్లాడుతూ "ఈ కష్ట సమయంలో మా ఆలోచనలు, సానుభూతి అదితి, రాకేష్, సిద్ కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటాయి. ఈ విషాద మరణాలకు గల కారణాలను క్షుణ్ణంగా అన్వేషిస్తున్నాము. ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున, ప్రసార మాధ్యమాలు గానీ, సాధారణ ప్రజలు గానీ ఎలాంటి అపోహలు, ఊహాగానాలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాము" అని పేర్కొన్నారు.
లండన్‌లో భారత సంతతి కుటుంబం మృతి
June 10, 2026
0
Tags