ఏప్రిల్ 17న సోషల్ మీడియా దిగ్గజం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) నుంచి సరికొత్త మెసేజింగ్ యాప్ 'XChat'ను విడుదల చేయబోతున్నారు. గోప్యతకు పెద్దపీట వేస్తూ, వాట్సాప్ వంటి యాప్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రూపొందించారు. ప్రారంభంలో ఈ యాప్ కేవలం ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆపిల్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే ఈ యాప్ లిస్ట్ అయింది, ఆసక్తి గల వారు ముందస్తు నమోదు చేసుకోవచ్చు. దీని ఇంటర్‌ఫేస్ చూడటానికి ఆపిల్ 'ఐమెసేజ్' లాగే చాలా సింపుల్‌గా, ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఈ యాప్‌లో సైన్ అప్ అవ్వడానికి ఫోన్ నంబర్ అవసరం లేదు. 'X' ఖాతాతో నేరుగా లాగిన్ అవ్వొచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. డేటాను ట్రాక్ చేయడం కానీ, ప్రకటనలు చూపించడం కానీ ఉండవు. అవతలి వ్యక్తి మీ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీయకుండా అడ్డుకునే ఫీచర్ ఇందులో ఉంది. ఒకే గ్రూప్‌లో గరిష్టంగా 481 మందితో చాట్ చేయవచ్చు. సందేశాలను ఎడిట్ చేసే లేదా డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది. నిర్ణీత సమయం తర్వాత సందేశాలు వాటంతట అవే డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. హిబ్రూతో సహా 46 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఎక్స్ ను కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌గా కాకుండా, అన్ని సేవలు అందించే ఒకే ఒక్క 'సూపర్ యాప్'గా మార్చాలనేది మస్క్ లక్ష్యం. ఇందులో భాగంగానే ఇప్పుడు మెసేజింగ్ యాప్‌ను తెస్తున్నారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారానే ఒకరికొకరు డబ్బులు పంపుకునే (పీర్-టు-పీర్ చెల్లింపులు) ఆర్థిక సేవలను కూడా ప్రారంభించే సంకేతాలు ఇచ్చారు.
ఏప్రిల్ 17న XChat విడుదల
April 13, 2026
0
Tags