బెంగళూరు వరకు పగిలిన అద్దంతో ఎలా వెళ్తారు? : హెల్మెట్ పెట్టుకుని నడుపుతానన్న బస్సు డ్రైవర్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లే శ్రీలక్ష్మీనరసింహ ట్రావెల్స్‌ బస్సు ఆదివారం రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కోర్టు కూడలి వద్దకు 36 మంది ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు వచ్చారు. అయితే, ఆ బస్సు ముందు అద్దం పగిలిపోయి ఉండటం చూసి ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. “బెంగళూరు వరకు పగిలిన అద్దంతో ఎలా వెళ్తారు?” అని డ్రైవర్‌ను ప్రశ్నించారు. ప్రయాణికుల ప్రశ్నకు బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన డ్రైవర్, అత్యంత నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. “అద్దం పగిలితే ఏమవుతుంది? గాలి రాకుండా నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతాను” అన్నాడు. దీనికి తోడు బస్సు స్టార్ట్ చేయగానే ఇంజిన్ నుంచి భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. డ్రైవర్ తీరుతో విసిగిపోయిన ప్రయాణికులు వెంటనే మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రావెల్స్ యాజమాన్యం నుంచి టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేలా చూస్తామని ప్రయాణికులు చెప్పారు. ఓ ఆరుగురు మాత్రం అత్యవసరంగా బెంగళూరు వెళ్లాలని చెప్పడంతో వారికి మరో వాహనం ఏర్పాటు చేసి పంపించారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, రవాణాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ బస్సుకు రెండు రోజుల క్రితం ప్రమాదం జరగడంతో సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని.. ఎవరైనా ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని మార్కాపురం పోలీసులు హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default