ఆంధ్రప్రదేశ్ కు గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ వచ్చారు. ఆయనకు రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్, ప్రజా ప్రతినిధులు, పలువురు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దట్టమైన పొగమంచు ఆవరించి ఉండటం వల్ల బిల్ గేట్స్ ప్రయాణించిన విమానం ల్యాండింగ్ లో జాప్యం చోటు చేసుకుంది. క్లియరెన్స్ కోసం కొంత సమయం గాలిలో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అనంతరం క్లియరెన్స్ లభించగానే అది సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీలో జరగనున్న ఎఐ-ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ కోసం బిల్ గేట్స్ భారత్ కు వచ్చారు. ఆయన పర్యటన ఏపీతో ప్రారంభమైంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత ఆధారిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది. ఆయా రంగాలపై బిల్ గేట్స్ తో చర్చించనుంది. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేయడానికి తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నామని నారా లోకేష్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్‌గేట్స్ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. బిల్‌గేట్స్ వెంట ఆయన ప్రతినిధి బృందం సభ్యులు మైఖేల్ థియోడార్ జాయోగృలస్, క్రిస్టియాన మరియా ఇస్కుందర్, అంకుర్ చంద్రకాంత్ ఓరా, అర్చన వ్యాస్ ఉన్నారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు సీఎం వివరించారు. పరిపాలనలో టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై గేట్స్‌తో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం వివరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన బిల్ గేట్స్ : ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
February 16, 2026
0
Tags