ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు యథాతథం ?

Telugu Lo Computer
0


ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజషన్  2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 8.25 శాతంగానే కొనసాగించాలని సంస్థ భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం మార్చి 2న జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వెలువడనుంది. వరుసగా మూడవ ఏడాది కూడా అదే వడ్డీ రేటును కొనసాగించడం అనేది ఉద్యోగుల దీర్ఘకాలిక పొదుపుకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈపీఎఫ్ఓ సుమారు రూ. 28 లక్షల కోట్ల భారీ నిధిని నిర్వహిస్తోంది. ఈ నిధులను సంస్థ ప్రధానంగా సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెడుతుంది. నివేదికల ప్రకారం కొత్తగా వచ్చే ఇన్ ఫ్లోస్‌లో 45 నుండి 65 శాతం వరకు ప్రభుత్వ సెక్యూరిటీలలో 20 నుండి 45 శాతం ఇతర డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడుతున్నారు. కేవలం 5 నుండి 15 శాతం వరకు మాత్రమే ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మిశ్రమ పెట్టుబడి విధానం వల్ల మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు 8.25 శాతం వడ్డీని ఇచ్చేంత మిగులు నిధులు సంస్థ వద్ద ఉన్నాయి. భవిష్యత్తులో మార్కెట్ పరిస్థితులు క్షీణించినా లేదా ఆదాయం తగ్గుముఖం పట్టినా, ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రేటులో కోత పడకుండా ఉండేందుకు ఈపీఎఫ్ఓ ఒక కొత్త 'స్టెబిలైజేషన్ రిజర్వ్ ఫండ్'ను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పుడు కొంత మొత్తాన్ని పక్కన పెట్టి, తక్కువ లాభాలు వచ్చే ఏడాదిలో దాన్ని ఉపయోగించి వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతారు. దీనివల్ల చందాదారులకు తమ రిటైర్మెంట్ సొమ్ముపై ఒక భరోసా కలుగుతుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేవలం వడ్డీ రేట్ల గురించే కాకుండా, ఇతర సాంకేతిక మార్పులపై కూడా చర్చ జరగనుంది. పీఎఫ్ వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేయడం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడం, ఆన్‌లైన్ విత్‌డ్రాయల్స్ మరింత సులభతరం చేయడం వంటి అంశాలు అజెండాలో ఉండే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఉన్న నిబంధనలను ఇప్పటికే సరళతరం చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default