క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్, గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్, కార్ల్స్‌బెర్గ్ ఐపీవోలకు రానున్నాయి. క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ సొల్యూషన్స్ ఇష్యూ ఈ నెల 23న ప్రారంభమై 25న ముగియనుంది. దీని ధర 1000-1053గా ప్రకటించింది. రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 1,900 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 3,100 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 20న షేర్లను ఆఫర్ చేయనుంది. తొలుత 2025 ఆగస్ట్ దరఖాస్తులో రూ. 5,200 కోట్ల సమీకరణకు సిద్ధపడినప్పటికీ పరిమాణాన్ని కుదించింది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 1,125 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. మార్చి 2న లిస్ట్‌కానున్న కంపెనీ రూ. 12,325 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. ఫెర్టిలిటీ సర్వీసుల సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ విమెన్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రూ. 75-79 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభమై 24న ముగియనుంది. దీనిలో భాగంగా 1.14 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 95 లక్షల షేర్లను ప్రమోటర్ మనికా ఖన్నా విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా సంస్థ రూ. 165 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను ఆఫర్ చేయనుంది. వెరసి కృత్రిమ గర్భధారణ(ఫెర్టిలిటీ) సరీ్వసులందించే సంస్థ తొలిసారి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను దేశవ్యాప్తంగా 19 కొత్త ఐవీఎఫ్ కేంద్రాల ఏర్పాటుకు వెచ్చించనుంది. రూ. 20 కోట్లు రుణచెల్లింపులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ నెల 27న లిస్ట్‌కానున్న సంస్థ రూ. 575 కోట్ల మార్కెట్ విలువను అందుకునే వీలుంది. మాల్ట్ పానీయాల డెన్మార్క్ దిగ్గజం కార్ల్స్‌బెర్గ్ దేశీ బిజినెస్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలని యోచిస్తోంది. తద్వారా వాటాదారులకు విలువ చేకూర్చాలని చూస్తున్నట్లు గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్ వెల్లడించారు. అయితే పబ్లిక్ ఇష్యూ చేపట్టడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని స్పష్టం చేశారు. దేశీయంగా పటిష్ట వృద్ధిని సాధిస్తున్న కంపెనీ దేశీ బిజినెస్‌ను లిస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు.
0 Comments