భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు ?

Telugu Lo Computer
0


భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా మనకు చమురుపై భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. ఒకప్పుడు బ్యారెల్‌కు 7-8 డాలర్లు ఉన్న డిస్కౌంట్, ఇప్పుడు ఏకంగా 11 డాలర్ల వరకు చేరింది. అంటే రష్యా నుంచి కొనడం వల్ల భారత్‌కు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. అందుకే మన దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఒత్తిడితో రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు రష్యా నుంచి ఆర్డర్లు నిలిపివేసి, వెనిజులా వైపు చూస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా దిగుమతులు తగ్గించడం మొదలుపెట్టాయి. రష్యా ఆయిల్ మానేసి అమెరికా ఆయిల్ కొనడం అనేది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద టెక్నికల్ సమస్య ఉంది. రష్యా నుంచి వచ్చే యూరల్ క్రూడ్ కొంచెం బరువుగా ఉంటుంది, అందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలోని రిఫైనరీలు కూడా ఈ రకమైన చమురును శుద్ధి చేయడానికి అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. కానీ అమెరికా అమ్మే షెల్ ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. ఒకవేళ మనం అమెరికా ఆయిల్ వాడాలంటే, దానిని ఇతర గ్రేడ్లతో కలిపి ప్రాసెస్ చేయాలి. ఇది చాలా ఖరీదైన పని. అంటే వస్తువు రేటు ఎక్కువ, దానిని వాడుకునే ఖర్చు కూడా ఎక్కువే. నిపుణుల విశ్లేషణ ప్రకారం రష్యా చమురును కాదని అమెరికా చమురు వైపు వెళ్తే, భారత రిఫైనరీలకు ప్రతి బ్యారెల్‌పై కనీసం 7 డాలర్ల అదనపు భారం పడుతుంది. రష్యా నుండి చమురు రావడం కంటే, అమెరికా నుంచి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది, దీనివల్ల షిప్పింగ్ ఛార్జీలు కూడా తడిసి మోపెడవుతాయి. రిఫైనరీల ఖర్చు పెరిగితే, ఆ భారాన్ని కంపెనీలు భరించవు. నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజల మీదకు నెట్టేస్తాయి. ఫలితంగా ప్రస్తుతం రూ.110 లోపు ఉన్న పెట్రోల్ ధరలు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default