మణిపూర్‌లో నెలల తరబడి జాతుల మధ్య జరుగుతున్న హింసాకాండ ఉఖ్రుల్ జిల్లాకు వ్యాపించింది. ఈ హింస కుకీ-జో, మైతేయి వర్గాల మధ్య పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు నాగా ప్రాబల్యం ఉన్న ఉఖ్రుల్ జిల్లాకు పాకడం ఆందోళన కలిగిస్తోంది. లిటాన్ గ్రామం మిశ్రమ జనాభా కలిగిన ప్రాంతం కావడం వల్ల, ఈ గొడవలు ఇతర వర్గాలకు కూడా విస్తరిస్తే రాష్ట్రం మొత్తం అదుపు తప్పే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు ప్రశాంతంగా ఉన్న ఈ జిల్లాలోని లిటాన్ గ్రామంపై సాయుధ దుండగులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 30కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉన్న సమయంలో సాయుధ దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. భారీగా కాల్పులు జరుపుతూ గ్రామంలోకి ప్రవేశించిన దుండగులు పెట్రోల్ బాంబులు, మండే పదార్థాలను ఉపయోగించి ఇళ్లకు నిప్పు పెట్టారు. ప్రాణభయంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు కట్టుబట్టలతో అడవుల వైపు పరుగులు తీశారు. చూస్తుండగానే దశాబ్దాల కాలంగా నిర్మించుకున్న నివాసాలు బూడిద కుప్పలుగా మారాయి. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, పారా మిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అయితే కొండ ప్రాంతం, దుర్భరమైన దారి కావడంతో భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టింది. భద్రతా దళాలకు, దుండగులకు మధ్య కూడా కొంతసేపు ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుని, డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు, సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. ఉఖ్రుల్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఇచ్చిన కర్ఫ్యూ సడలింపులను తక్షణమే రద్దు చేసింది. రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని భద్రతా సంస్థలు ప్రకటించాయి. ఈ ఘటనపై విపక్షాలు 'డబుల్ ఇంజన్' ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఉండిపోయిందని రాహుల్ గాంధీ వంటి నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు, స్థానిక స్వచ్ఛంద సంస్థలు భద్రతా బలగాల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ : లిటాన్ గ్రామంలో 30 ఇళ్లు దగ్ధం!
February 10, 2026
0
Tags