ఖమ్మం కూల్చివేతలను ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు

Telugu Lo Computer
0


తెలంగాణలోని ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌ కూల్చివేతలను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని ఈ రాక్షస కాండను తీవ్రంగా ఖండిస్తున్నాననన్నారు. ఈ మేరకు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసిన హరీశ్ రావు.. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసులను మోహరించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని నిలదీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే మీరు చేస్తున్న అరాచకం లోకానికి తెలియకూడదనే మీ భయం అర్థమవుతోందని చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారన్నారు. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం అని నమ్మబలికిన రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే.. గుండె తరుక్కు పోతున్నదన్నారు. ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషం అన్నారు. బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయం అన్నారు. వెంటనే ఈ అక్రమ కూల్చివేతలను ఆపి పోలీసులు వెనక్కి వెళ్లాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని, పేదల గూడు చెదిరితే.. మీ అధికారం గద్దెలు అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు. వెంటనే కూల్చివేతలు ఆపి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదని పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default