Ad Code

నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'దండోరా' !


సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు గ్రామీణ కథలను ఇష్టపడేవారికి 'దండోరా' ఒక మంచి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని చెప్పొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాను చూసే మంచి అవకాశం లభించింది. ఇది నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 'దండోరా' థియేటర్ విజయం తర్వాత ఓటీటీ వేదికపై కూడా మంచి స్పందన రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ టైమ్‌లో మెదక్ దగ్గర తుళ్లూరు అనే గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఈ గ్రామంలో కుల వివక్ష బలంగా ఉంటుంది. అణచి వేయబడిన కులానికి చెందిన వ్యక్తి మరణిస్తే ఊరి స్మశానంలో కాకుండా ఊరి చివర దహనం చేయడం అక్కడి ఆనవాయితీ. అలాంటి గ్రామంలో అగ్రకులానికి చెందిన శివాజీ మరణిస్తాడు. కానీ అతడి శవాన్ని ఊరి శ్మశానంలో దహనం చేయడానికి కుల పెద్దలు నిరాకరిస్తారు. "శివాజీని మా కులం బహిష్కరించింది" అంటూ సంచలన నిర్ణయం తీసుకుంటారు. అసలు అగ్రకులానికి చెందిన శివాజీని అతడి కులమే ఎందుకు వెలివేసింది? అతడి గతంలో ఏం జరిగింది? అన్న ప్రశ్నలతో కథ మొదలవుతుంది. శివాజీకి కొడుకు విష్ణు, కూతురు సుజాత ఉంటారు. కుల గర్వమే ప్రాణంగా బతికే శివాజీ, తక్కువ కులానికి చెందిన రవితో కూతురు ప్రేమను అంగీకరించలేడు. కుల పెద్దల సహాయంతో రవికి దారుణమైన శిక్ష వేయించడంతో కొడుకు విష్ణు తండ్రిని అసహ్యించుకుని దూరమవుతాడు. ఒంటరైన శివాజీ జీవితంలో వేశ్య శ్రీలత ప్రవేశం అతడిలో మార్పు తెస్తుంది. పశ్చాత్తాపంతో మరణించిన శివాజీ మరణం తర్వాత గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు, గ్రామ సర్పంచ్ పాత్ర, విష్ణు తీసుకున్న నిర్ణయం, కులాల మధ్య మార్పు వచ్చిందా లేదా అన్నదే 'దండోరా' సినిమా కథ. అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య అంతరాలు, బేధాలు, ప్రేమలు, పెళ్లిళ్ల నేపథ్యంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే 'దండోరా'లో దర్శకుడు మురళీకాంత్ ఎంచుకున్న కోర్ పాయింట్‌లో మాత్రం స్పష్టమైన కొత్తదనం కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి కథల్లో అణచివేయబడిన కులాలే బాధితులుగా చూపిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం అగ్ర కులానికి చెందిన వ్యక్తులే బాధితులుగా మారడం ప్రధాన నావెల్టీ పాయింట్. ఇదే అంశం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అయితే కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఫస్టాఫ్‌లో దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కథ ముందుకు కదలకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా రొటీన్, రెగ్యులర్ ట్రాక్‌లోనే సాగుతుందా అనే సందేహం కూడా కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ పాయింట్‌తో ఈ అనుమానాలన్నిటికీ సూటిగా, సుత్తి లేకుండా దర్శకుడు సమాధానం చెబుతాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా సరైన గాడిలో పడిందన్న భావన కలుగుతుంది.


Post a Comment

0 Comments

Close Menu