బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం : రెండురోజుల పాటు తెలంగాణలో వర్షాలు

Telugu Lo Computer
0

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాతావరణం అకస్మాత్తుగా మారి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసిన నేపథ్యంలో సోమవారం కూడా నగరంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడొచ్చని సూచించారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్నింటికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కూడా వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి రాత్రి నుంచి ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని సూచించారు. మరోవైపు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default