గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన మణిపురి సంగీత విద్వాంసుడిని కొట్టి చంపిన దుండగులు

Telugu Lo Computer
0

ఢిల్లీలో ఇంటి బయట జరుగుతున్న గోల, అరుపులపై అభ్యంతరం వ్యక్తం చేసిన మణిపురి సంగీత విద్వాంసుడు చోంగ్‌థమ్ విక్రమ్ సింగ్‌ను కొంతమంది దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఇంటి బయట పనిచేస్తున్న డెలివరీ సిబ్బంది, దాబా సిబ్బందితో జరిగిన వివాదం చివరకు దాడికి దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి. ఆగ్నేయ ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలోక్రి వద్ద 17 ఏళ్లుగా ప్రైవేట్ సంగీత ఉపాధ్యాయుడిగా, గిటారిస్ట్‌గా పనిచేస్తున్న చోంగ్‌థమ్ విక్రమ్‌ను కొందరు వ్యక్తులు కొట్టి హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆగ్నేయ ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి ఆదివారం అర్ధరాత్రి విక్రమ్‌ చెత్త పారవేయడానికి తన మూడవ అంతస్తులోని ఫ్లాట్ నుండి కిందికి వెళ్ళారు. తన ఇంటి వద్ద దాబా కార్మికులు, డెలివరీ బాయ్స్ చేస్తున్న అరుపులు, గోల భరించలేక విక్రమ్ సింగ్ కిందకు వచ్చి గోల చేయ వద్దని కోరారు. ఈ క్రమంలో జరిగిన వివాదంతో రెచ్చిపోయిన ఎనిమిది మంది ఆయనపై దాడికి దిగారు. అపార్ట్‌మెంట్‌లో థర్డ్‌ఫ్లోర్‌దాకా తరుముకుంటూ వచ్చి కారిడార్‌లో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను ఆయన కుమారుడు యైఫాబా సమీపంలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గాయపడిన విక్రమ్‌ను మెట్ల మీదుగా మోసుకెళ్తున్న దృశ్యాలు, దాడి చేసినవారు అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైనాయి. ఈ కేసులో ఏడుగురుని అరెస్టు చేయడంతో పాటు ఒక బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానిక హోటళ్లలో ఫుడ్ ప్యాకింగ్, డెలివరీ పనులు చేస్తున్నారు. అరెస్టు అయిన వారిని భరత్ కుమార్(19), ప్రమోద్(26), రంజాన్ ఖాన్(22), విజయ్(36), దీపాంశు (21), మోహన్ విశ్వకర్మ(32), మన్ను(26) గా గుర్తించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default