వివాదాస్పద విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు-2026ను గత కాలానికి వర్తింపజేయబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చినట్లు మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా వెల్లడించారు. మిజోరం చర్చి నాయకుల ప్రతినిధి బృందంతో కలిసి అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ఈ బిల్లును ఆగస్టు 12న పార్లమెంట్‌లో చర్చించి ఆమోదానికి తీసుకురానున్నట్లు హోంమంత్రి వెల్లడించినట్లు చెప్పారు. ప్రతిపాదిత ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థలపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ రద్దు అయిన, గడువు ముగిసిన లేదా స్వచ్ఛందంగా వదులుకున్న సంస్థలకు చెందిన విదేశీ నిధులు, వాటితో కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికార సంస్థ ఆధీనంలోకి తీసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకురావాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే ఈ చట్టాన్ని గతానికి వర్తింపజేస్తే నిజాయితీగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా, మిజోరం కోహ్రాన్ హ్రుయితు కమిటీ, మిజోరం చర్చిల మండలి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పరిపాలనా లేదా సాంకేతిక లోపాల కారణంగా స్వచ్ఛంద సంస్థలు శిక్షార్హులుగా మారే అవకాశం ఉందని పేర్కొంటూ, ఈ చట్టాన్ని భావి కాలానికి మాత్రమే వర్తింపజేయాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన అమిత్ షా, బిల్లు గతానికి వర్తించదని హామీ ఇచ్చినట్లు లాల్దుహోమా తెలిపారు.
ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును గత కాలానికి వర్తింపజేయబోమని అమిత్ షా హామీ ఇచ్చారు
August 07, 2026
0
Tags