రైతులకు నీటి కొరత రాకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది : ఢిల్లీలో మీడియాతో జరిగిన ఒక చిట్‌చాట్ లో కేటీఆర్ ప్రశంస

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పనితీరును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆకాశానికెత్తేశారు. ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తున్న కష్టకాలంలోనూ ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అద్భుతమంటూ ప్రశంసలు గుప్పించారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన ఒక చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ న్యూస్ గా మారింది. సాధారణంగా గోదావరి జలాల తరలింపు, పట్టిసీమ ప్రాజెక్టులపై గతంలో రెండు రాష్ట్రాల మధ్య భిన్నమైన రాజకీయ వాదనలు వినిపించేవి. కానీ, కేటీఆర్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ జల వ్యూహాన్ని ఓ రేంజ్‌లో సమర్థించారు. ఎల్‌నినో పరిస్థితులు వెంటాడుతున్నప్పటికీ ఏపీలో రైతులకు నీటి కొరత రాకుండా అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని కేటీఆర్ కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలోనూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతు ప్రయోజనాలకు ఏపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అభినందించారు. సముద్రంలోకి వృథాగా పోయే ప్రతి చుక్క నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని, అక్కడి సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతలో కనీసం సగం కూడా ఇక్కడి రేవంత్ సర్కార్ ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ వివాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారితీ (ఎన్డీఎస్‌ఏ) తీరు పూర్తిగా పక్షపాతంగా ఉందంటూ ధ్వజమెత్తారు. "గతంలో ఏపీలో పోలవరం డయాఫ్రమ్‌ వాల్ దెబ్బతిన్నప్పుడు ఈ ఎన్డీఎస్‌ఏ కంటికి కనిపించలేదా? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్ స్వల్పంగా కుంగితే మాత్రం ప్రత్యేక శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు?" అని కేటీఆర్ నిలదీశారు. మేడిగడ్డపై ఇచ్చింది సాంకేతిక నివేదిక కాదని, అది పూర్తిగా కేంద్రంలోని ఎన్డీఏ రాజకీయ నివేదిక అని తేల్చిచెప్పారు. ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన ప్రాథమిక నివేదికకు, తుది నివేదికకు అస్సలు పొంతన లేదని.. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఎన్డీఎస్‌ఏ అధికారులను ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఇంజినీర్లు ఇచ్చిన అసలు నివేదికను ప్రభుత్వం ఎందుకు దాస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పాలన గాలికి కొట్టుకుపోతోందని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయిలో చేస్తున్న పనులకు ఎక్కడా సంబంధం లేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టి వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ పేరు తలవని రోజు ఆయనకు గడవడం లేదని ఎద్దేవా చేశారు. గత రెండేళ్ల కాలంలో కేసీఆర్ ఎప్పుడూ ఏ ఒక్కరి పేరు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణలో కోటి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏకంగా 30 శాతం వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పక్క రాష్ట్రం రైతుల కోసం ప్రాజెక్టులు కడుతుంటే.. ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను ఎలా బద్నాం చేయాలనే కోణంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default