ఐఫోన్ యూజర్లు వాట్సాప్ లో మైక్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటు !

Telugu Lo Computer
0

ఫోన్ యూజర్ల కోసం వాట్సాప్  ఒక సరికొత్త, అత్యంత ఉపయోగకరమైన షార్ట్‌కట్ ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో వాయిస్ లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్న సమయంలో మైక్ మోడ్‌ను మార్చాలంటే ఐఫోన్ కంట్రోల్ సెంటర్‌ను ఓపెన్ చేయాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త అప్‌డేట్ ద్వారా ఆ ఇబ్బంది పూర్తిగా తొలగిపోనుంది. కాల్ సమయంలోనే నేరుగా వాట్సాప్ యాప్ లోపల నుంచి మైక్రోఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. టెక్‌ నివేదికల ప్రకారం, వాట్సాప్ ఐఓఎస్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ పెట్టారు. కాల్ సమయంలో కనిపించే 'మోర్' మెనూలోకి వెళితే కొత్త 'మైక్ మోడ్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయడం ద్వారా కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయకుండానే ఐఫోన్ మైక్రోఫోన్ సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. ఆపిల్ సంస్థ అందించే వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్, స్టాండర్డ్, ఆటోమేటిక్ మోడ్‌లను ఈ షార్ట్‌కట్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. చుట్టుపక్కల శబ్దం ఎక్కువగా ఉన్నప్పుడు వాయిస్ ఐసోలేషన్ మోడ్ కేవలం మీ గొంతును మాత్రమే గ్రహించి అవతలి వారికి స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం క్రమక్రమంగా యూజర్లందరికీ అందుబాటులోకి వస్తోంది. ఐఫోన్‌లో ఈ ఫీచర్ ఇంకా కనిపించకపోతే రాబోయే అప్‌డేట్ వరకు కొద్ది రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. ఎటువంటి అదనపు ప్రయాస లేకుండా కాల్ మధ్యలోనే మైక్ సెట్టింగ్స్‌ను మార్చుకునే వెసులుబాటు కలుగుతుండటంతో ఐఫోన్ యూజర్లు ఈ అప్‌డేట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default