మెరికా సరిహద్దుల్లో చట్టవిరుద్ధంగా ఉంటూ, పబ్లిక్ సేఫ్టీకి ముప్పుగా మారిన వారిని ఏరివేయడమే లక్ష్యంగా బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఈ ప్రత్యేక ఆపరేషన్ను నిర్వహించారు. ఈ వ్యూహాత్మక తనిఖీలకు అధికారులు ‘ఆపరేషన్ చెక్మేట్’ అని నామకరణం చేశారు. రహదారులపై వెళ్తున్న సెమీ ట్రక్కులను (భారీ వాణిజ్య వాహనాలు) జల్లెడ పట్టగా ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్ లో మొత్తం 52 మంది అక్రమ వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకోగా, వారిలో 36 మంది రోడ్లపై భారీ కమర్షియల్ ట్రక్కులు నడుపుతూ పట్టుబడటం గమనార్హం. అరెస్టయిన 36 మంది ట్రక్ డ్రైవర్లలో అత్యధికులు భారతదేశానికి చెందినవారే కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 30 మంది భారతీయ డ్రైవర్లను అధికారులు అరెస్ట్ చేయగా, మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందినవారిగా గుర్తించారు. అమెరికాలో నివసించడానికి ఎలాంటి చట్టపరమైన వీసాలు లేదా అనుమతులు లేనప్పటికీ, వీరంతా భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారు. నిందితుల ప్రొఫైల్ ను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వీరిలో కొందరి వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి రాష్ట్రాల నుంచి పొందిన కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ లు ఉండగా, మరికొందరి వద్ద అసలు ఎలాంటి లైసెన్సులు లేవు. అసలు దేశంలోనే చట్టవిరుద్ధంగా ఉంటున్న వీరు ఈ లైసెన్సులు ఎలా సంపాదించారనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన నిందితులందరిపై అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం వీరంతా ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. చట్టపరమైన విచారణ ప్రక్రియ పూర్తి కాగానే వీరిని అమెరికా నుంచి అధికారికంగా బహిష్కరించనున్నారు.