తెలంగాణలో 'సెన్సస్ 2027' డిజిటల్ జనాభా లెక్కల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో తన వివరాలను నమోదు చేసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ (స్వయం నమోదు) ప్రక్రియలో పాల్గొన్నారు. పారదర్శకతను పెంచేందుకు దేశంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ విధానంలో ఈ గణన చేపడుతున్నారు. ప్రస్తుతం కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఈ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు 15 రోజుల పాటు పౌరులు తమ వివరాలను se.census.gov.in వెబ్‌సైట్‌లో స్వచ్ఛందంగా నమోదు చేసుకోవచ్చు. రోజుకు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో గృహ సౌకర్యాలకు సంబంధించిన 33 ప్రశ్నలు ఉంటాయి. ఎలాంటి పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు, 15-20 నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలు సమర్పించాక వచ్చే 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ'ని, తర్వాత ఇంటికి వచ్చే అధికారులకు చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం విశేషం. మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి డేటాను ధృవీకరిస్తారు. మరిన్ని వివరాల కోసం 1855 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.
తెలంగాణలో డిజిటల్ జనగణన ప్రారంభం
April 26, 2026
0
Tags