పార్లమెంట్ ఆవరణలో ఈ ఉదయం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సామాజిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరిగాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రేరణ్ స్థల్ వద్ద ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ నివాళులర్పించి ప్రసంగించారు. అంతకు ముందు పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాక ప్రధాని మోడీ అక్కడే వేచి ఉన్న రాహుల్ గాంధీకి, ఇతరులకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మోడీమాట్లాడుతుండగా.. రాహుల్ గాంధీ తల ఊపుతూ, వేళ్లు కదిలిస్తూ సమాధానం ఇస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందనే కుతూహలం నెలకొంది. అయితే రాహుల్‌ను ప్రధాని మోడీ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం మోడీ మాట్లాడుతూ జ్యోతిరావ్ పూలే సమాజానికి వెలుగునిచ్చిన మహానుభావుడు. ఆయన ఆలోచనలు నేటికీ సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం మార్గదర్శకంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం మనందరికీ ప్రేరణ. ఆయన చూపిన మార్గం నేటి భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ నివాళి వేదికపై ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకోవడం, స్నేహపూర్వకంగా పలకరించుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.
జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు : ముచ్చటించుకున్న మోడీ, రాహుల్ గాంధీ
April 11, 2026
0
Tags