ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు, కరుడుగట్టిన సిద్ధాంతకర్త మహముద్ అహ్మదీ నెజాద్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ మీడియా సంస్థ 'మారీవ్' కథనాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొంతకాలంగా అహ్మదీ నెజాద్ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నివాసమే లక్ష్యంగా జరిగిన ఈ క్షిపణి దాడిలో నెజాద్ మృతి చెందారు. ఇరాన్ ఆరో అధ్యక్షుడిగా 2005 నుండి 2013 వరకు బాధ్యతలు అహ్మదీ నెజాద్ నిర్వర్తించారు. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేతగా పేరుగాంచారు. టెహ్రాన్ మేయర్ స్థాయి నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2005లో అప్పటి అగ్రనేత అక్బర్ హషీమీ రఫ్సంజానీని ఓడించి, అనూహ్యంగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. తన పదవీ కాలంలో ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో పశ్చిమ దేశాలకు సవాలు విసురుతూ, అంతర్జాతీయంగా ఇరాన్‌ను తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణంలోకి నెట్టారని చెబుతుంటారు. ఆయన తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవడమే కాకుండా, ఇరాన్ దౌత్యపరంగా ఏకాకి కావడానికి దారితీశాయని విశ్లేషకులు అంటుంటారు.
వైమానిక దాడిలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు నెజాద్ మృతి
March 02, 2026
0
Tags