ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా భార్య, కూతురు మృతిచెందారు. వారితోపాటే ఆత్మహత్యాయత్నం చేసిన భర్త కొనఊపిరితో ఉండగా బంధువులు ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం అతను కూడా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే నాదెండ్ల మండలం సాతులూరుకు చెందిన కుంభా గోపి, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారిలది పెద్దల సమక్షంలో జరిగిన ప్రేమ వివాహం. వీరి ప్రేమ, దాంపత్యానికి గుర్తుగా ఒక పాప పుట్టింది. గోపి భోపాల్ ఎయిమ్స్ లో మత్తు డాక్టర్ గా, అదే ఆస్పత్రిలో శంకరకుమారి (30) నర్సుగా పనిచేస్తున్నారు. అయితే కుమార్తె మౌనిహ (3) మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేకుండా ఉండటంతో.. ఆ చిన్నారి చూసి కన్నీరుమున్నీరయ్యేవారు. శంకరకుమారి 20 రోజుల క్రితం తన బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కూతురిని అలా చూడలేక ఇద్దరం చనిపోతామని గోపి ఆమెకు వాట్సప్ మెసేజ్ పెట్టగా, ఏదైనా మీతో పాటే నేను కూడా అని కుమారి బదులిచ్చింది. దీంతో గోపి కూడా రెండ్రోజుల క్రితం భోపాల్ నుంచి ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి తన భార్య, బిడ్డతో కలిసి నరసరావుపేటకు వెళ్లి ఓ లాడ్జిలో దిగారు. ఆపై మత్తు ఇంజెక్షన్ చేసుకుని చనిపోతున్నామని తన సోదరికి గోపి ఆదివారం కొన్ని ఫొటోలను వాట్సప్ లో పంపించాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారి లొకేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్లేలోగానే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ముగ్గురూ అపస్మారక స్థితిలో కనిపించారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శంకరకుమారి, మౌనిహ మరణించినట్లు వైద్యులు తెలిపారు. గోపి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స పొందుతూ అతను కూడా మరణించాడు.
మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేని కూతురును చూడలేక ఎయిమ్స్ డాక్టర్ కుటుంబం ఆత్మహత్య !
March 30, 2026
0
Tags