విశాఖపట్నంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీవోఐ) ఆఫీసు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇమ్మిగ్రేషన్ సహకారం అందించేందుకు వీలుగా ఈ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి భోగాపురానికి ఎయిర్ పోర్టును తరలించేందుకు వీలుగా జరుగుతున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ సేవల కోసం హైదరాబాద్ లేదా చెన్నై వెళ్లాల్సి వస్తోంది. విశాఖలో ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం ఏర్పాటైతే ఆ ఇబ్బందులు తప్పుతాయి. సమయం కూడా ఆదా అవుతుంది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమయ్యాక సాధారణ ప్రయాణికులతో పాటు విదేశీ విమానాల రాక, కార్గో సేవలు విస్తరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కొత్త కార్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిబ్బంది కొరత, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల తగిన స్ధాయిలో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు చేయట్లేదు. అందువల్ల, ఇమ్మిగ్రేషన్ తనిఖీలను నిర్వహించడానికి వైజాగ్‌లో ఇమ్మిగ్రేషన్ బ్యూరో కోసం ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వైజాగ్ శివార్లలోని మారికవలస ఓజోన్ లేఅవుట్ సమీపంలో వీఎంఆర్డీయేకి సంబంధించిన ప్రాంతంలో ఈ ఆఫీసు ఏర్పాటు చేయబోతున్నారు.
విశాఖపట్నంలో ఇమ్మిగ్రేషన్ ఆఫీసు !
January 18, 2026
0
Tags