చైనాలో ఒక్కొక్క కోతి ధర రూ. 25 లక్షలకు చేరుకుంది. అడవుల్లో కోతులు కోకొల్లలుగా ఉన్నప్పటికీ, ప్రయోగశాలల్లో పరిశోధనలకు అవసరమైన కోతుల కొరత తీవ్రంగా ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా కొత్త ఔషధాల తయారీలో క్లినికల్ ట్రయల్స్ కోసం కోతులను ఉపయోగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి. అడవుల నుంచి నేరుగా పట్టి తెచ్చిన కోతులను ప్రయోగాలకు వాడటం చట్టరీత్యా నేరం. అడవి కోతులకు రకరకాల ఇన్ఫెక్షన్లు ఉండే అవకాశం ఉంటుంది, దీనివల్ల ప్రయోగ ఫలితాల్లో ఖచ్చితత్వం ఉండదు. అడవి నుంచి తెచ్చిన కోతులను బ్రీడింగ్ కేంద్రాల్లో పెంచి, వాటికి పుట్టిన రెండో తరం కోతులను మాత్రమే ల్యాబ్ ప్రయోగాలకు వినియోగిస్తారు. ఒక కోతి పుట్టి, పెరిగి ప్రయోగాలకు సిద్ధం కావడానికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం చైనాలో కొత్త ఔషధాల తయారీ విపరీతంగా పెరగడంతో ఆ స్థాయికి తగ్గట్లుగా కోతుల సరఫరా జరగడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 13 లక్షలుగా ఉన్న కోతి ధర డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ఏకంగా రూ. 25 లక్షలకు చేరింది. కోతుల ధరలు పెరగడంతో మందుల తయారీ ఖర్చు భారమవుతోందని, కొత్త ప్రయోగాలు ఆలస్యమవుతున్నాయని చైనా పరిశోధనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
చైనాలో ఒక్కొక్క కోతి ధర రూ. 25 లక్షలు !
January 11, 2026
0
Tags