పంజాబ్‌లోని అమృత్‌సర్ పరిసర ప్రాంతాలను పవిత్ర నగరంగా మారుస్తూ అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వందలాది కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. అమృత్‌సర్‌లోని ఓల్డ్ సిటీతో పాటు శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్, తల్వండి సాబో ప్రాంతాలను పవిత్ర నగరాలుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతాల్లో చేపలు, మాంసం, పొగాకు, మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. భగవంత్ మాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భక్తి కోణంలో బాగున్నప్పటికీ తరతరాలుగా అక్కడ మద్యం, మాంసం, పొగాకు వ్యాపారాలపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హాల్ గేట్ ప్రాంతంలో నాలుగో తరానికి చెందిన చేపల వ్యాపారి రాజేందర్ కుమార్ మాట్లాడుతూ.. ఇది పంజాబ్‌లోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అని.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో తమ తరతరాల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమృత్‌సర్ కేవలం ఆధ్యాత్మిక నగరమే కాదని, ప్రపంచ ప్రసిద్ధ ఆహార కేంద్రమని స్థానిక హోటల్ యజమానులు గుర్తు చేస్తున్నారు. స్వర్ణ దేవాలయం చుట్టూ ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయని.. ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీకి విస్తరించడం సరైంది కాదని వారు వాదిస్తున్నారు. హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే చత్తా మాట్లాడుతూ.. హోటళ్లు బయట నుంచి మాంసాన్ని తెచ్చుకోవచ్చని, కానీ ఈ నిషేధం వల్ల లోలోపల అక్రమ వ్యాపారం, అవినీతి పెరిగే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రతిపక్షాలు, వ్యాపారుల ఆందోళనలపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి జీవనోపాధి దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే.. దశల వారీగా దుకాణాలను అక్కడి నుంచి తరలిస్తామని తెలిపింది. బాధిత వ్యాపారులతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామని ఆప్ సీనియర్ నేత బల్తేజ్ పన్నూ వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం సుమారు 150 మాంసం, పొగాకు, మద్యం దుకాణాలను ఆ ప్రాంతం నుంచి తరలించాల్సి ఉంటుంది.
అమృత్‌సర్ పరిసర ప్రాంతాలను పవిత్ర నగరంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ ప్రభుత్వం
December 27, 2025
0
Tags