నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడి!

Telugu Lo Computer
0


నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాద ముఠాలే లక్ష్యంగా అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించింది. క్రిస్మస్ పండుగ వేళ జరిగిన ఈ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. వాయువ్య నైజీరియాలో అమాయక క్రైస్తవులను ఊచకోత కోస్తున్న "ఐసిస్ ఉగ్రవాద వ్యర్థాల"పై ఈ దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా సైన్యాధ్యక్షుడి హోదాలో తానే స్వయంగా ఈ దాడులకు ఆదేశాలిచ్చానని ట్రంప్ వెల్లడించారు. "కొన్ని శతాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా నైజీరియాలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఈ హింసను ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నేను గతంలోనే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. తన ప్రకటనలో ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలాన్ని వాడారు. అమెరికా రక్షణ శాఖ ఈ ఆపరేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసిందని కొనియాడారు. తన నాయకత్వంలో ఉగ్రవాద ముఠాల పట్ల అమెరికా రాజీలేని పోరాటం చేస్తుందని నొక్కి చెప్పారు. "మా సైనికులకు దేవుడి ఆశీస్సులు ఉండాలి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆఖరికి చనిపోయిన ఉగ్రవాదులకు కూడా ! ఒకవేళ క్రైస్తవుల ఊచకోత ఆగకపోతే, మున్ముందు ఇలా చనిపోయే ఉగ్రవాదుల సంఖ్య ఇంకా పెరుగుతుంది" అంటూ ఘాటుగా హెచ్చరించారు. అమెరికా ఆఫ్రికా కమాండ్ నివేదిక ప్రకారం, ఈ దాడులు డిసెంబర్ 25న నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో జరిగాయి. నైజీరియా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఎలాంటి ఆయుధాలు వాడారు అనే వివరాలను వైట్ హౌస్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default