హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలతో బాబ్రీ స్మారకం నిర్మిస్తామని తెహ్రీక్ ముస్లిం షబ్బాన్ అధ్యక్షుడు ముస్తాఖ్ మాలిక్ ప్రకటించారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి 33 ఏళ్లయిన సందర్భంగా ఈనెల 6న జరిగిన బహిరంగ సమావేశంలో ముస్తాఖ్ మాలిక్ ప్రకటన చేశారు. బాబ్రీ యానివర్శిటీతో పాటు రొటీన్ పబ్లిక్ మీటింగ్‌లో గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు మెమోరియల్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ మెమోరియల్‌లో కొన్ని సంక్షేమ సంస్థలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏ విధంగా దీన్ని నిర్మిస్తాం, ఎప్పుడు నిర్మిస్తాం అనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. టీఎంసీ సస్పెండ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ శనివారంనాడు ముర్షీదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో కట్టడం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేరోజు హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్ ప్రకటన వెలువడటం గమనార్హం. బెంగాల్‌లో బాబ్రీ మసీదు శంకుస్థాపన వ్యవహారంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పోలరైజేషన్‌కు పాల్పడుతోందని, బాబర్ పేరుతో ఎలాంటి కట్టడాన్నయినా భారత్ వ్యతిరేకిస్తుందని అన్నారు. అయితే బీజేపీ వాదనను హుమయూన్ కబీర్ తోసిపుచ్చారు. మసీదు నిర్మాణం తన హక్కు అని, తాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదని చెప్పారు. ఎవరైనా మందిరం, చర్చి నిర్మించుకోవచ్చని, తాను మసీదు నిర్మిస్తున్నానని చెప్పారు. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం చేపడతామని, అందులో ఒక ఆసుపత్రి, గెస్ట్ హౌస్, మీటింగ్ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హైదరాబాద్‌లో బాబ్రీ స్మారకం నిర్మిస్తాం : తెహ్రీక్ ముస్లిం షబ్బన్ అధ్యక్షుడు ముస్తాఖ్ మాలిక్
December 07, 2025
0
Tags