మహిళలు 45 నుంచి 55 ఏళ్ల వయసులో మోనోపాజ్‌లోకి అడుగుపెడతారు. ఈ సమయంలో అండాశయాలు అండాలను విడుదల చేయడం ఆపేస్తాయి. అప్పుడే పీరియడ్స్ కూడా ఆగిపోతాయి. ఒక సంవత్సరం పాటు క్రమంగా పీరియడ్స్ రాకపోతే మోనోపాజ్ దశలోకి అడుగుపెట్టినట్టే. అలా కాకుండా కొన్ని సార్లు రేడియేషన్, కీమోథెరపీ లాంటి అండాశయాలు తొలగించాల్సిన అవసరం పడే చికిత్సల వల్ల, గర్భాశయం తొలగించినా పీరియడ్స్ ఆగిపోతాయి. కాకపోతే ఈ వయసులో కూడా కొన్ని సంతాన సాఫల్య చికిత్సల ద్వారా మాత్రం పిల్లల్ని కనడం సాధ్యం పడవచ్చు. మోనోపాజ్‌తో వచ్చే మార్పుల వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ప్రభావం పడుతుంది. వ్యక్తులను బట్టి ఈ లక్షణాలు మారొచ్చు. అయితే కొంత మందికి ఈ లక్షణాలు ఉండకపోవచ్చు. మరికొంతమంది ఈ లక్షణాలతో ఏళ్ల తరబడి బాధ పడుతూ ఉండొచ్చు.
లక్షణాలు : రాత్రిపూట చెమటలు పట్టడం. ఉన్నట్టుండి ఫీవర్ వచ్చినట్లు అయ్యి శరీరం హీట్ ఎక్కడం, ముఖ్యంగా ముఖం, మెడ, ఛాతీ దగ్గర వేడిగా అనిపిస్తుంది. నెలసరి క్రమంలో మార్పులు రావడం, బ్లీడింగ్ ఎక్కువ లేదంటే తక్కువ కావడం కూడా మోనోపాజ్ లక్షణాలే. యోని దగ్గర పొడి బారడం. లైంగిక కలయికతో నొప్పి రావడం. భావోద్వేగాల్లో మార్పులు, డిప్రెషన్, ఆందోళన పెరగడం. నిద్రలేమి సమస్య చుట్టుముట్టడం లేదా నిద్రపోవడంలో ఇబ్బంది కలగడం.