ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను పరిష్కరించాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీకి శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. భద్రతా మండలిని విస్తరించాలని, అందులో ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్ దేశాలకు సభ్యత్వం కల్పించాలని సూచించింది. అయితే, దీన్ని చైనా, పాకిస్తాన్ వ్యతిరేకించాయి. అంతర్జాతీయ శాంతిభద్రతల నిర్వహణ అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఇందులో జీ4 (భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ) దేశాల తరఫున భారత ప్రతినిధి ఆర్.రవీంద్ర కీలక ప్రసంగం చేశారు. ''ఐరాస భద్రతా మండలిని 15 నుంచి 25-26కు పెంచాలి. మరో ఆరు శాశ్వత సభ్య దేశాలు, నాలుగు లేదా ఐదు తాత్కాలిక సభ్య దేశాలను మండలిలో చేర్చాలి. శాశ్వత సభ్యులుగా కొత్తగా చేర్చే ఆరింటిలో రెండు ఆఫ్రికా దేశాలు, మరో రెండు ఆసియా-పసిఫిక్ దేశాలు ఉండాలి. లాటిన్ అమెరికా/కరేబియా నుంచి ఒకటి.. పశ్చిమ యూరోపియన్ ప్రాంతం నుంచి ఒక దేశానికి శాశ్వత ప్రాతినిధ్యం కల్పించాలి. కొత్తగా చేర్చే శాశ్వత సభ్యులకు కూడా వీటో లాంటి అధికారాలు కల్పించాలి'' అని రవీంద్ర సూచనలు చేశారు.''ఐరాస భద్రతా మండలి చర్చల అజెండాలో 70శాతం ఆఫ్రికా దేశాల కోసమే ఉంటాయి. కానీ, మండలిలో దానికి శాశ్వత గళం వినిపించే అవకాశం లేకపోవడం విచారకరం. జీ20 లాంటి గ్రూప్‌ల్లోనూ ఆఫ్రికా యూనియన్‌కు పూర్తి సభ్యత్వం కల్పించాం. కానీ, ఐరాసలో ప్రాతినిధ్యం లేదు'' అని ఆయన గుర్తుచేశారు. మండలికి సంస్కరణలు చేయకపోతే ఈ అంతర్జాతీయ సంస్థ ఉద్దేశాలు సఫలీకృతం కాబోవని అన్నారు. అయితే, భారత్ వ్యాఖ్యలతో పాక్, చైనా విభేదించాయి. ''ఆఫ్రికాను ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మండలిలో దానికి దీర్ఘకాల సభ్యత్వం ఇవ్వాలి. అయితే, అందుకోసం భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు'' అంటూ ఐరాసకు పాక్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ అక్కసు వెళ్లగక్కారు. అటు చైనా ప్రతినిధి ఫు కాంగ్ మాట్లాడుతూ.. ''కొన్ని దేశాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మండలి విస్తరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి'' అంటూ న్యూఢిల్లీపై పరోక్షంగా నోరుపారేసుకున్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. 53 దేశాలతో ప్రారంభమైన ఐరాసలో ఇప్పుడు సభ్యదేశాల సంఖ్య 193కు చేరింది. ఇన్నేళ్లలో భద్రతా మండలిని ఒకే ఒక్కసారి 1965లో విస్తరించారు. దాంతో మండలి సభ్యదేశాల సంఖ్య 15కు చేరింది. ఇందులో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లే నేటికీ కొనసాగుతున్నాయి. మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతిపై మారుతుంటాయి.
భారత శాశ్వత సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా, పాకిస్తాన్ !
August 13, 2024
0
Tags