తమిళనాడు అసెంబ్లీలో మరోసారి త్రిష వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. సీఎం విజయ్ రాష్ట్రంలో మహిళలను కించ పర్చేందుకు కొందరు భావప్రకటనా స్వేచ్చను వాడుకుంటున్నారంటూ ఉదయనిధి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. రాజకీయ నాయకులకు రాజకీయ వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ ఉందని, అయితే మహిళలను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కించపరిచేవిగా లేదా ద్వంద్వార్థం ఉన్నవిగా ఉంటున్నాయన్నారు. అందుకే వాటికి ఒక హద్దు విధించినట్లు విజయ్ తెలిపారు. డబుల్ మీనింగ్ లో ద్వంద్వార్థంలో మాట్లాడేవారిని ప్రజలు గమనిస్తూనే ఉంటారని, మన ఇళ్లలోనూ తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు వంటి మహిళలు ఉన్నారని గుర్తుచేశారు. మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని విజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా గతంలో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఎదురైన అనుభవాన్ని కూడా విజయ్ గుర్తుచేశారు. అసెంబ్లీలో మేడమ్ జయలలిత ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో మనం చూశామన్నారు. రాజకీయ విమర్శలు మహిళలను కించపరిచే స్థాయికి వెళ్లకూడదన్నారు. నేను మళ్లీ చెబుతున్నాను, మీరు రాజకీయంగా విమర్శలు చేయవచ్చు, కానీ మహిళలను కించపరచడం సరికాదు. నేను వారికి హితబోధ చేయడానికి ఇక్కడ లేను, ఇది వాస్తవం అని విజయ్ స్పష్టం చేశారు. డీఎంకేకు ఓటు వేయని వారు ప్రశాంతంగా చనిపోరని ఒక సీనియర్ డీఎంకే నేత చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ప్రజల తీర్పును గౌరవించాలని, రాజకీయ పార్టీలు కనీస రాజకీయ హుందాతనాన్ని, మర్యాదను పాటించాలని కోరారు. తన ప్రభుత్వం ఏ ఒక్క వ్యక్తికో లేదా ప్రత్యేక వర్గానికో పరిమితం కాదని, తమిళనాడు ప్రజలందరి ప్రభుత్వంగా ఉంటుందని విజయ్ వెల్లడించారు.
మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది : తమిళనాడు అసెంబ్లీలో విజయ్ హెచ్చరిక
September 07, 2026
0
Tags