తెలంగాణలోని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని దరిగాం రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిబాఫులే బాలికల గురుకుల పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్న ఉషాన్ శృతి అనే విద్యార్థినిపై తోటి విద్యార్థినులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. గత శనివారం రాత్రి హాస్టల్ గదిలో తోటి విద్యార్థినులు శృతి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు, చేతులు కదలకుండా గట్టిగా బిగించి పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఆమె నోట్లో పెన్ను క్యాప్ వేసి, బలవంతంగా మింగించారు. ప్రాణభయంతో ఊపిరాడక ఇబ్బంది పడిన శృతి, ఈ విషయాన్ని వెంటనే స్కూల్ సిబ్బందికి చెప్పింది. స్కూల్ యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న తండ్రి రమేశ్ ఆదివారం ఉదయం మహాత్మా జ్యోతిబాఫులే బాలికల గురుకుల స్కూల్కు వెళ్లి కుమార్తెను వెంటనే మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు స్కానింగ్ నిర్వహించగా బాలిక కడుపులో పెన్ను క్యాప్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం డాక్టర్లు అత్యవసర చికిత్స అందించి, ఎండోస్కోపీ ద్వారా ఆ క్యాప్ ను బయటకు తీసి పాప ప్రాణాలు కాపాడారు. కూతురి ప్రాణాలకే ముప్పు తెచ్చిన ఈ ఘటనపై శృతి తండ్రి రమేష్ సోమవారం నాడు కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హాస్టల్లో జరిగిన ఈ దారుణంపై విచారణ జరిపి, బాధ్యులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
కాగజ్‌నగర్ గురుకుల స్కూల్లో దారుణం : టెన్త్ క్లాస్ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి పెన్ను క్యాప్ ను మింగించిన తోటి విద్యార్థినులు
July 07, 2026
0
Tags