ఫామ్ ప్లాట్లకు పెరుగుతున్న ఆదరణ : ట్రెండ్‌గా మారుతున్న వీకెండ్ హోమ్స్ సంస్కృతి
నగరవాసులు సరికొత్త జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే వీకెండ్స్‌లో ప్రశాంతంగా గడిపేందుకు వీలుగా నగర శివార్లలో వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ప్లాట్లకు మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. యాంత్రికమైన నగర జీవనం, కాలుష్యం నుండి ఉపశమనం పొందడానికి ఈ వీకెండ్ హోమ్స్ సంస్కృతి ఇప్పుడు ఒక బలమైన ట్రెండ్‌గా మారుతోంది. ఈ తరహా మార్పుకు ఐటీ రంగంలో వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ ,హైబ్రిడ్ పని విధానాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వారంలో ఐదు రోజులు ఆఫీసు లేదా ఇంట్లో ల్యాప్‌టాప్‌లకే పరిమితమయ్యే ఉద్యోగులు, వారాంతాల్లో ప్రకృతి ఒడిలో గడపడానికి ఇష్టపడుతున్నారు. నగరానికి కాస్త దూరంగా ఉన్నా, హైవే కనెక్టివిటీ బాగుండటంతో గురువారం లేదా శుక్రవారం సాయంత్రానికే ఫార్మ్ హౌస్‌లకు చేరుకుని, అక్కడి నుంచే తమ విధులను సైతం నిర్వహించుకుంటున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఈ ధోరణికి మరింత ఊతాన్ని ఇస్తోంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్ ప్రాజెక్టులు కేవలం ఖాళీ స్థలాలకే పరిమితం కాకుండా, నగరంలోని లగ్జరీ విల్లాలకు ఏమాత్రం తీసిపోని వసతులతో రూపుదిద్దుకుంటున్నాయి. 24 గంటల భద్రత, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇంటర్నెట్ సౌకర్యాలతో పాటు ఆర్గానిక్ పండ్ల తోటలు, కూరగాయల సాగుకు వీలుగా డెవలపర్లు వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఇటు పెట్టుబడికి పెట్టుబడి, అటు వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక సొంత ఇల్లు.. ఇలా రెండూ ఒకేచోట లభిస్తుండటంతో అటు ఐటీ నిపుణులు, ఇటు వ్యాపారవేత్తలు ఈ ఫార్మ్ ప్లాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ తరహా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం సెలవులు గడపడానికే కాకుండా, దీర్ఘకాలంలో స్థిరాస్తి విలువ పెరిగి మంచి లాభాలను తెచ్చిపెట్టే సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఇన్వెస్టర్లు దీనిని భావిస్తున్నారు. నగర పరిధులు విస్తరిస్తున్న కొద్దీ ఈ 60-80 కిలోమీటర్ల జోన్ భవిష్యత్తులో ప్రధాన నివాస ప్రాంతాలుగా మారే అవకాశం ఉండటం కూడా ఈ మార్కెట్ బూమ్‌కు ఒక ముఖ్య కారణం.
Comments
Post a Comment