జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే ఐఐటీ రూర్కీ డేటా లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ డేటా లీక్ ను అంగీకరించింది. అభ్యర్థుల రికార్డులు, అడ్మిట్ కార్డ్ డాక్యుమెంట్లు లీక్ అయినట్లు వెల్లడైంది. ఫలితాల మౌలిక సదుపాయాల్లో ఉపయోగించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లోపం వల్లే ఇది జరిగిందని ఐఐటీ తెలిపింది. ఈ లోపాన్ని సరిదిద్దే పనులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ డేటా లీక్ ఘటన ఓ సైబర్‌సెక్యూరిటీ పరిశోధకుడు ఎక్స్ లో చేసిన పోస్ట్ తో వెలుగులోకి వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల వ్యవస్థకు సంబంధించిన పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్‌ను ధృవీకరణ లేకుండానే యాక్సెస్ చేయడానికి వీలుగా కాన్ఫిగర్ చేసినట్లు ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ లోపంతో సుమారు 1,79,600 ఫలితాల రికార్డులు, 1,87,300 అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ లు బహిర్గతమయ్యాయి. అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్‌లతో సహా వ్యక్తిగత వివరాలు ఈ డేటాలో ఉన్నాయని వెల్లడైంది. షేర్ చేసిన స్క్రీన్‌షాట్లలో అడ్మిట్ కార్డ్ పత్రాలు, సబ్జెక్టుల వారీగా మార్కులు, ర్యాంకులు వంటి ఫలితాల డేటా స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై ఐఐటీ రూర్కీ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించింది. "@DarthKermy72747 క్లౌడ్ స్టోరేజ్ డివైస్‌లో కాన్ఫిగరేషన్ సమస్యను సూచించినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ విషయాన్ని ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని ట్వీట్ చేసింది. స్టోర్ చేసిన డేటా 'రీడ్-ఓన్లీ' ఫార్మాట్‌లో ఉంది, కాబట్టి ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. "డేటా రీడ్-ఓన్లీగా ఉన్నందున, ఎటువంటి మార్పులకు అవకాశం లేదు. మీ బాధ్యతాయుతమైన, నైతిక ప్రవర్తనను అభినందిస్తున్నామని ఐఐటీ రూర్కీ పేర్కొంది. ఈ వారంలోనే ఐఐటీ రూర్కీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఐఐటీలలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష కీలకం. ఈ లోపం గతంలో సీబీఎస్‌ఈ ఆన్సర్ స్క్రిప్ట్‌ల లీక్ ఘటన తరహాలోనే ఉందని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. అయితే, డేటా ఎంతకాలం అందుబాటులో ఉంది, ప్రభావిత అభ్యర్థులకు సమాచారం ఇచ్చారా అనే వివరాలు ఐఐటీ రూర్కీ వెల్లడించలేదు.
0 Comments