Tuesday, October 13, 2026

ఫ్లైదుబాయ్‌ ఘటన : ఇద్దరు మాల్దీవుల పైలట్ల అరెస్టు

ఫ్లైదుబాయ్‌ ఘటనకు సంబంధించి ఇద్దరు మాల్దీవుల పైలట్లను యూఏఈ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనను భగ్నం చేసే క్రమంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడి ప్రయాణికులను కాపాడాడు. మాల్దీవులకు చెందిన 'అధాధు' వార్తా పోర్టల్ కథనం ప్రకారం ఈ ఇద్దరు పైలట్లను అక్టోబర్ 3వ తేదీనే యూఏఈ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నిర్బంధానికి సంబంధించిన సమాచారాన్ని యూఏఈలోని మాల్దీవుల ఎంబసీ ద్వారా వారి కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియజేశారు. ఈ సంచలన అరెస్టుపై మాల్దీవుల ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే, అరెస్టయిన మాల్దీవుల జాతీయులపై మోపిన అభియోగాలు ఏమిటి, ఈ కుట్రతో వారికి ఎంతవరకు సంబంధం ఉందనే అంశాలపై యూఏఈ అధికారులు కూడా పెదవి విప్పడం లేదు. దర్యాప్తులో గోప్యత పాటిస్తుండటంతో ఈ ఉదంతంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 30న జరిగిన ఈ ఉగ్రయత్నం వెనుక పెద్ద కుట్ర కోణం ఉన్నట్లు యూఏఈ భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఫ్లైదుబాయ్ కో-పైలట్, ఒమన్‌కు చెందిన హమ్మామ్ అల్-హమ్మామి.. విమానాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని కూల్చివేసే ఉద్దేశంతో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై ఏకంగా గొడ్డలితో విరుచుకుపడ్డాడు. ఈ ప్రాణాంతక దాడిని లెక్కచేయకుండా కెప్టెన్ మచ్ఛర్ సాహసోపేతంగా ప్రతిఘటించి విమానాన్ని పెను ప్రమాదం నుంచి కాపాడారు. మాల్దీవుల ప్రముఖ పత్రిక 'మిహారు' అందించిన సమాచారం ప్రకారం.. అరెస్టయిన ఆ ఇద్దరు మాల్దీవుల పైలట్లు, ప్రధాన నిందితుడు అల్-హమ్మామితో కలిసి ఒకే కార్యాలయంలో పనిచేశారు. అంతేకాదు, వారు నివసించే అపార్ట్‌మెంట్ భవనంలోనే హమ్మామ్ కూడా ఉంటున్నట్లు తేలింది. వీరి మధ్య ఉన్న ఈ సాన్నిహిత్యమే వీరు అరెస్టు కావడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే,ఈ కుట్రలో వీరి పాత్ర ఏంటి అనే దానిపై స్పష్టమైన ఆధారాలు బయటికి రావాల్సి ఉంది. ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌లో మొత్తం ఆరుగురు మాల్దీవుల జాతీయులు పైలట్లుగా పనిచేస్తున్నారు. వీరిలో అరెస్టయిన ఇద్దరు ఇటీవలే ఆ సంస్థలో కొత్తగా రిక్రూట్ అయినట్లు 'ఎడిషన్.ఎంవి' నివేదించింది.