Ad Code

మాస్కో స్కూల్ 21 సందర్శించిన మంత్రి నారా లోకేష్

మాస్కోలోని ప్రముఖ ఐటీ, సాంకేతిక కేంద్రాలను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ఆర్థిక, సాంకేతిక సేవల సంస్థ స్బేర్' ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన విద్యాసంస్థ స్కూల్ 21 ను ఆయన సందర్శించారు. సాంప్రదాయ విద్యావిధానానికి పూర్తిగా భిన్నంగా, సరికొత్త పద్ధతులతో అక్కడ సాగుతున్న డిజిటల్ విద్యావిధానాన్ని నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి మంత్రి లోకేష్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రష్యాలో స్బేర్‌బ్యాంక్ ప్రారంభించిన ఈ స్కూల్ 21 అంతర్జాతీయంగా విద్యా వర్గాల్లో ఎంతో ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. ఇది ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విద్యా కార్యక్రమంగా నడుస్తోంది. ఇక్కడి చదివే విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయకపోవడం దీని ప్రత్యేకత.అన్నింటికీ మించి ఈ స్కూల్ ప్రత్యేకత టీచర్లు ఉండకపోవడం. ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ అయిన ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన భవిష్యత్ పాఠశాల విద్యా పద్ధతులను అనుసరిస్తోంది. ఇక్కడ టీచర్లు, లెక్చరర్లు, టైమ్ టేబుళ్లు ఉండవు. విద్యార్థులే స్వయంగా పీర్-టు-పీర్ అంటే ఒకరినొకరు చూసి నేర్చుకోవడం పద్ధతిలో గేమిఫైడ్ ప్రాజెక్టుల ద్వారా కోడింగ్ నేర్చుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా మాస్కోలోని స్బేర్ సిటీ ని కూడా మంత్రి నారా లోకేష్ సందర్శించి అక్కడి అత్యాధునిక ఆవిష్కరణలను పరిశీలించారు. కేవలం డబ్బులు డ్రా చేయడానికే కాకుండా ప్రాథమిక వ్యాధినిర్ధారణ, ఇతర వినూత్న డిజిటల్ సదుపాయాలతో కూడిన స్బేర్ బ్యాంక్ ప్రత్యేక ఏటీఎంను లోకేష్ పరిశీలించి, దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఒకే చోట అత్యాధునిక బ్యాంకింగ్, వైద్య పరిజ్ఞానాన్ని మిళితం చేసిన తీరుపై ఆయన ఆసక్తి కనబరిచారు. స్బేర్ సిటీ ప్రతినిధులు మంత్రి లోకేష్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ సంస్థ సాధించిన సాంకేతిక ప్రగతిని వివరించారు. అక్కడి పరిశోధన , అభివృద్ధి విభాగాలు, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ , డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి ప్రజెంటేషన్‌లో క్షుణ్ణంగా ప్రదర్శించారు. ఏపీని ఐటీ, నైపుణ్యాభివృద్ధి హబ్‌గా మార్చడానికి ఇక్కడి సాంకేతికతలను, స్కూల్ 21 వంటి విద్యా నమూనాలను ఆంధ్రప్రదేశ్‌లో ఏ విధంగా అప్లై చేయవచ్చనే అంశంపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సానుకూల చర్చలు జరిపారు.

Post a Comment

0 Comments

Close Menu